Kerala Local Polls: కేరళలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం (Kerala Local Polls) చోటుచేసుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా విశ్లేషించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అధికారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు (LDF) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శనివారం వెలువడిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయం వేడెక్కిన వేళ, అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు (LDF) ఊహించని పరాభవం ఎదురైంది. ఆ పార్టీకి మద్దతు తగ్గిపోయిందన్న సంకేతాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఊహిచని స్థాయిలో పుంజుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా స్వల్పంగా పుంజుకుంది.
కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు
ఎల్డీఎఫ్ కూటమికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘకాలం పాటు తమకు కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనూ గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో యూడీఎఫ్ నాలుగు గెలుచుకోగా, ఎల్డీఎఫ్, ఎన్డీయే దక్కించుకున్నాయి. ఇక, మున్సిపాలిటీల విషయానికి వస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ 86లో 54 చోట్ల విజయం సాధించింది. లెఫ్ట్ 28కి పరిమితం కాగా, ఎన్డీయే 2 స్థానాలు దక్కించుకుంది. ఇక, పంచాయతీ స్థాయిలోనూ కాంగ్రెస్ కూటమి మెరుగ్గా రాణించింది. గ్రామ పంచాయతీల్లో యూడీఎఫ్ 504, లెఫ్ట్ 341, ఎన్డీయే 26 స్థానాలను గెలుచుకున్నాయి. బ్లాక్ పంచాయతీ స్థాయిలో యూడీఎఫ్‌కు 79, ఎల్డీఎఫ్ 63 చోట్ల గెలిచాయి. జిల్లా పంచాయతీ స్థాయిలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ చెరో ఏడు చొప్పున విజయం సాధించాయి. యూడీఎఫ్ కూటమి బాగా మెరుగుపడింది. బీజేపీ కూడా పట్టణ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటింది. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోణంలో చూస్తే కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్‌కు సానుకూలంగా మారతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కేరళలో ద్విముఖ పోరుగా, త్రిముఖ పోరు ఉంటుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
సాంప్రదాయకంగా, క్రమశిక్షణతో కూడిన కేడర్ నెట్‌వర్క్ ఉన్న ఏరియాల్లో కూడా ఎల్డీఎఫ్ తన సత్తా చాటలేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. పంచాయతీ స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో సంస్థాగతంగా సీపీఐ(ఎం) పట్టున్న ప్రాంతాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సాధించడం ఇదే మొదటిసారి.
అసెంబ్లీ ఎన్నికల్లో ‘స్థానిక’ ప్రతిబింబం
కేరళలో గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే, స్థానిక సంస్థల ఫలితాలు, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు 2010లో కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా స్థానిక ఎన్నికలలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఆ తర్వాత సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక, 2020 స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్డీఎఫ్ బలంగా రాణించింది. మరుసటి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో, తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించిన యూడీఎఫ్ కూటమి, వచ్చే ఏడాది ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉందంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి.
Read Also- Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

