SSC Exam Timetable: తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Telangana Board of Secondary Education) అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి, భారం తగ్గించేందుకు విద్యాశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఎస్ఎస్సీ చరిత్రలో తొలిసారిగా పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఏప్రిల్ 16 వరకు అంటే నెల రోజులకు పైగా కొనసాగనున్నయి. సైన్స్ పేపర్లు మినహా మిగతా పరీక్షలన్నీ ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. సైన్స్ పేపర్లకు గంటన్నర సమయం కేటాయించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్లను వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈసారి బోర్డు కీలక నిర్ణయం
విద్యార్థులకు పరీక్షలంటే భయం, ఒత్తిడిని తగ్గించేందుకు బోర్డు ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నది. సమయం ఎక్కువ ఉండడంతో పరీక్షలకు చదువుకునేందుకు విద్యార్థులకు వీలు ఉంటుందని భావిస్తున్నది. వారికి మేలు చేసేలా సీబీఎస్‌ఈ పరీక్షల విధానాన్ని అనుసరించి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ప్రధాన సబ్జెక్టుల మధ్య కనీసం మూడు నుంచి ఐదు రోజుల వరకు గ్యాప్ రానున్నది. గతంలో కేవలం రెండు వారాల్లో ముగిసే పరీక్షలు ఈసారి దాదాపు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇది విద్యార్థులపై భారం, ఒత్తిడిని తగ్గించనున్నది. ఇదిలా ఉండగా పాత విధానంలోనే అంటే 80 మార్కులకు థియరీ పరీక్ష, 20 ఇంటర్నల్స్‌కు కేటాయిస్తున్నారు. అయితే, గతంలో ఉన్న గ్రేడింగ్ వ్యవస్థను తొలగించి, మార్కుల ఆధారిత ఫలితాలను అందించనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందనను వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read: Jupally Krishna Rao: పర్యాటక రంగంలో 40 వేల మందికి ఉద్యోగాలు.. రూ.7,045 కోట్ల పెట్టుబడులు
కొందరి నుంచి వ్యతిరేకత
పది పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించాలనే నిర్ణయంపై పలువురు అంగీకరిస్తుండగా ఇంకొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్వహణ ప్రయోగాత్మకమని ఎస్టీయూ టీఎస్ సంఘం నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎస్ఎస్‌సీ పరీక్షలు నెల రోజులకుపైగా నిర్వహించడం ఏమాత్రం సరికాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ తెలిపారు. 33 రోజుల పాటు టెన్త్ పరీక్షలు నిర్వహించడం ప్రయోగాత్మకంగా ఉందన్నారు. పరీక్షలను సీబీఎస్ఈ తరహాలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు ఆందోళన చెందుతారని, పరీక్షల టైమ్ టేబుల్‌ను సవరించి, పది రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నా పత్రాలు భద్రపరచడం, మూల్యాంకన ప్రక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్‌లో ఎండలు తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు పరీక్షలు రాయడంలో ఇబ్బంది పడతారని చెబుతున్నారు.
సబ్జెక్ట్ పరీక్ష తేదీ
ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి 14
సెకండ్ లాంగ్వేజ్ మార్చి 18
థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్) మార్చి 23
మాథమాటిక్స్ మార్చి 28
ఫిజికల్ సైన్స్ ఏప్రిల్ 2
బయాలజీ ఏప్రిల్ 7
సోషల్ స్డడీస్ ఏప్రిల్ 13
ఓరియంటల్ లాంగ్వేజ్(పేపర్ 1) ఏప్రిల్ 15
ఓరియంటల్ లాంగ్వేజ్(పేపర్ 2) ఏప్రిల్ 16
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు..

