Harish Rao: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు వేదన, రోదన మిగిల్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి దారి తప్పింది, సంక్షేమం సన్నగిల్లింది, హామీల అమలు గాలికొదిలి అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ విజన్ ఏమిటో, విధానం ఏమిటో, అభివృద్ధి, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ద ఏమిటో తేటతెల్లం అవుతుందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనను నిర్వచించాలంటే మూడే మూడు మాటలు నిస్సారం, నిష్పలం, నిరర్ధకం అని దుయ్యబట్టారు. ప్రతి రోజు ప్రజల్ని కలుస్తాం, ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారని అలా జరుగుతుందా అని ప్రశ్నించారు.
పార్టీ మీటింగ్‌లకు అడ్డాగా..
ప్రజా దర్బార్‌ను ఉత్త ప్రహసనంగా మార్చివేశారన్నారు. ప్రజా దర్బార్ పక్కనే ఉండే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ఈ ఫిర్యాదుల గురించి ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ప్రజా భవన్ కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. సీఎల్పీ మీటింగ్‌లు పెట్టుకొని పార్టీ మీటింగ్‌లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు గెస్ట్ హౌజ్‌గా మార్చారని, అభివృద్ధి కాదు అసమర్థత, పారదర్శకత కాదు దోపిడీ, గ్యారంటీలు కాదు గారడీలు, ఇది ప్రజా పాలన కాదు ప్రజా వంచక పాలన అంటూ దుయ్యబట్టారు. ప్రజా సంపదను కొల్లగొట్టి తమ సొంత సంపాదనపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారని భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు.
Also Read: Suryapet Police: సూర్యాపేటలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 12 లక్షల మోసం బట్టబయలు!
హామీలు నెరవేర్చలేని..
రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగి రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారని ఆరోపించారు. మొదటి రోజు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కడంతో సోకాల్డ్ ప్రజా పాలన ప్రస్థానం ప్రారంభమైందని హరీశ్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేశారన్నారు. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోవాలని చురకలంటించారు. ల్యాండ్ కన్వర్షన్‌కు 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు.
బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ మంత్రి 30 శాతం ట్యాక్స్, లే అవుట్ కన్వర్షన్‌కు 30 శాతం ట్యాక్స్ దోచుకోవడంపై కేబినెట్‌లో ఓపెన్‌గా చర్చించుకుంటున్నారన్నారు. బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై పగబట్టి బ్లాక్ మెయిల్ పాలన చేస్తున్నారన్నారు. ఒక్క ఊరిలో కూడా పూర్తి రుణమాఫీ కాలేదని తెలిపారు. మొత్తం రుణమాఫీ అయ్యిందంటే తాను రాజీనామాకు సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ రైతు సంక్షోభ ప్రభుత్వమన్నారు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా పెద్ద కాంట్రాక్టర్ల బిల్స్ క్లియర్ అవుతున్నాయని హరీశ్ రావు అన్నారు.

