Minister vivek: సిద్దిపేట జిల్లాలో తన సత్తా చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అవకాశం కలిగిందని ఐక్యంగా ముందుకు వెళుతూ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి చూపాలని రాష్ట్ర మంత్రి జీ వివేక్ సూచించారు. గజ్వేల్ లో ఆదివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట జిల్లా కంచుకోటగా మారాలని సర్పంచ్, ఎంపీపీ, జెడ్పిటిసి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని పాగా వేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలనపై ప్రజల్లో ఆసక్తి ఉందని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం నింపాలని సూచించారు. ప్రజలలో నమ్మకం కలిగిస్తే గెలుపు సులభం అవుతుందని మంత్రి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి 25వేల ఓట్లు వెనుకబడి ఉన్నట్లు స్థానికులు చెప్పారని, మూడుసార్లు నిర్వహించిన సర్వేలలో కూడా అదే తేలిందన్నారు. మూడు నెలల్లో జూబ్లీహిల్స్ పరిస్థితిలే మారిపోయాయని 25 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సాధించడం తెలిసిందేనని మంత్రి వివరించారు. సిద్దిపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడానికి కార్యకర్తలు స్థానిక నాయకులు ఐక్యంగా కృషి చేస్తే సులభం అవుతుందని స్పష్టం చేశారు.
Also Read: Roads Development: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుండి విమాన కార్గో సేవలు..!
ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు మార్గాలు
గ్రామాలలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆదరణ పెంచిందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. గతంలో ఇందిరమ్మ పాలనలో పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని మళ్లీ ఇప్పుడే ఇస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మభ్యపెట్టి ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తుందని గ్రూపులకు తావివ్వకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని గొప్ప సంక్షేమ పథకాల శ్రీకారానికి దృష్టి సారిస్తుందని మంత్రి వివరించారు. మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికైన జగదేపూర్ మండల్ నిర్మల్ నగర్ సర్పంచ్ పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ పుష్ప, పలుగు గడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తునికి మక్త సర్పంచ్ స్వామి, కుకునూరుపల్లి మండలం పిటి వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ లను మంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి నాయకులు నిమ్మ రంగారెడ్డి, సర్దార్ ఖాన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: TG Panchayat Elections: ఓటర్లను ఆకట్టుకునేందుకు జోరుగా దావత్‌లు.. ఉగుతున్న మందు బాబులు

