TG Panchayat Elections: రాష్ట్రంలో ‘పంచాయతీ’ ముమ్మరమైంది. సర్పంచ్‌గా గెలవడం ద్వారా రాజకీయ పరమపద సోపానంలో మొదటి మెట్టు ఎక్కడానికి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్న మాటను నిజం చేస్తూ గెలుపు కోసం అన్ని ఎత్తులు వేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో రాత్రయితే చాలు గ్రామాల్లో మేకలు.. కోళ్లు తెగుతున్నాయి. మద్యం బాటిళ్లు ఖాళీ అవుతున్నాయి. దాంతోపాటు ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా జోరందుకుంది. పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా ఓటర్ల ఖాతాల్లోకి నగదును క్రెడిట్ చేస్తున్నారు.
సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని అభ్యర్థులు ప్రయత్నాలు
వేర్వేరు కారణాలతో ఇరవై నెలలకు పైగా వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆ సమయంలో పలువురు రిజర్వేషన్‌లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో పంచాయతీ ఎన్నికలపై కొన్ని రోజులపాటు సస్పెన్స్ నెలకొన్నది. అయితే, ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పాత పద్దతిలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవచ్చని చెప్పడంతో ఎలక్షన్ల ప్రక్రియ మొదలైంది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో త్వరలోనే 12.728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో లక్షా 14వేలకు పైగా వార్డులకు కూడా ఎలక్షన్లు కానున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైనా అత్యధిక శాతం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. ఆయా వార్డులకు కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఎలాగైనా సరే సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు దీని కోసం సామ, దాన, భేద, దండోపాయలను ప్రయోగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థులుగా ఉన్న అభ్యర్థులకు అడిగినంత డబ్బు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని ఊళ్లలో ప్రత్యర్థి శిబిరంలో కీలకంగా ఉన్న వారిని తమ వైపునకు తిప్పుకునే యత్నాలు చేస్తున్నారు. ఇక, మరికొన్ని గ్రామాల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు సైతం దిగుతున్నారు.
Also Read: Vande Bharat Sleeper: వందేభారత్ ‘స్లీపర్’ వచ్చేస్తోంది.. తొలి రైలు ఏ మార్గంలో ఖరారైందంటే?
ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు
అదే సమయంలో ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీని కోసం జోరుగా దావత్‌లు ఇస్తున్నారు. మటన్, చికెన్ తినిపిస్తున్నారు. ఈ క్రమంలో చీకటి పడితే చాలు గ్రామాల్లో మేకలు…కోళ్లు తెగుతున్నాయి. మటన్, చికెన్ వంటకాలతో ఘుమఘుమలాడుతున్నాయి. సీసాలకు సీసాల మద్యం ఖాళీ అవుతోంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో డిసెంబర్ నెల మొదటి నాలుగు రోజుల్లో దాదాపు 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటేనే పార్టీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. లిక్కర్ ఆదాయానికి పంచాయతీ ఎన్నికలు కిక్కునిచ్చాయని చెబుతున్న ఎక్సయిజ్ అధికారులు గతేడాదితో పోలిస్తే లిక్కర్ సేల్స్ ఈనెల మొదట నాలుగు రోజుల్లో 107 శాతం పెరిగాయని తెలిపారు.
జోరుగా డబ్బు పంపిణీ
ఒవైపు దావత్‌లతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థులు మరో వైపు డబ్బు పంపిణీని కూడా క్రమంగా జోరు చేస్తున్నారు. అయితే, పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్నేహితులు, బంధువుల అకౌంట్లలో నగదును జమ చేస్తున్నారు. ఆ తరువాత ఓటర్ల లిస్టు…వారి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఆయా నెంబర్లకు డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా నగదును ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. మామా…కాకా పైసల్ క్రెడిట్ అయినయా? లేదా? అని అడిగి తెలుసుకుంటున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ దావత్‌లు…డబ్బు పంపిణీ మరింత జోరందుకోవటం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read: Local Body Elections: సర్పంచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేతలు.. గెలవాల్సిందే అంటూ..!

