MP Etela Rajender: కమలాపూర్‌లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ భారీ ర్యాలీలో పాల్గొని, గ్రామమంతా నడిచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటి వద్ద ఆగి తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ర్యాలీలో ఈటల మాట్లాడుతూ, ‘నేను ఈ ఊరి బిడ్డను, ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాడిని’ అని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ‘ఎన్నికలు కులాలకు, రంగులకు సంబంధించినవి కావని, ప్రజల బ్రతుకులకు సంబంధించిన యుద్ధం ఇది. మా అభ్యర్థి సతీష్‌కి లిక్కర్ వ్యాపారం లేదు, భూముల వ్యాపారం లేదు. కో అంటే కో అన్నోడు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎర్రచీమకైనా అన్యాయం చేయలేదు. నన్ను ఈ స్థాయి వరకూ తీసుకువచ్చింది కమలాపూర్ గడ్డ’ అని ఈటల స్పష్టం చేశారు.
సతీష్‌ను గెలిపిస్తే..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లులుగా సర్పంచుల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని విమర్శించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, పంచాయతీ, అంగన్వాడీ, హాస్పిటల్ భవనాలు, రైతు వేదికలు నిర్మితమయ్యాయని పేర్కొన్నారు. ‘రియల్ ఎస్టేట్ డబ్బులతో ఓట్లు కొని గెలిచే వాళ్ల కాలు దొరకదు. ఓటుకు విలువ ఉంది, ఆత్మగౌరవం ఉంది’ అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించారు. సతీష్‌ను గెలిపిస్తే మళ్లీ పాత రోజుల లాగా పని చేస్తామని, పెన్షన్, రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూమ్, గ్రామానికి ఏం కావాలన్నా తామే ఇప్పిస్తామని ప్రజలకు అభయాన్నిచ్చారు.
Also Read: Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి పొంగులేటి వార్నింగ్
విలేకరిగా సమస్యలు పరిష్కరించా
సర్పంచ్ అభ్యర్థి సతీష్ మాట్లాడుతూ తాను 22 ఏళ్లుగా విలేకరిగా పనిచేశానని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు తెచ్చానని అన్నారు. ఎవరికి ఆరోగ్య సమస్యలున్నా, రక్తం కావాలన్నా నేను కేరాఫ్ అడ్రస్ అని గుర్తుచేశారు. ‘మీ ఇంటి బిడ్డను, ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటా. ఈటల గారి సేవా తత్పరతను పునికి పుచ్చుకొని ఆయన ప్రతినిధిగా సేవ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. చివరగా ప్రజలను కోరుతూ, సతీష్‌ను సర్పంచ్‌గా గెలిపించి ఈటలకు గిఫ్ట్‌గా ఇవ్వండి. మళ్లీ ఆయన్ను కమలాపూర్‌కు రావడానికి బాట వేయండి’ అంటూ విజ్ఞప్తి చేశారు.

