Mahabubabad News: మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికీ దోహదం చేసే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించగల ప్రతిష్టాత్మక “రైల్వే మెగా మెయింటేనేన్స్ డిపో” (Railway Mega Maintenance Depot) ను మహబూబాబాద్ జిల్లా నుండి తరలించేందుకు జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్(Muhammad Farid) స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వరంగల్ ఎంపీ ఆధిపత్యం – మానుకోటపై చిన్నచూపు
వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య(Kadiyam Kavya) సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ఫరీద్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఈ భారీ ప్రాజెక్టును, కేవలం తన రాజకీయ లబ్ది కోసం వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ‘నష్కల్’ (Nashkal) ప్రాంతానికి తరలించాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఒక గిరిజన జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్(Mahabubabad)కు దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలనుకోవడం కావ్య గారి అవివేకానికి నిదర్శనమని అన్నారు.
నిద్రపోతున్న ఎమ్మెల్యే, ఎంపీలు
జిల్లా నడిబొడ్డున ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్(MLA Murali Nayak) మరియు ఎంపీ బలరాం నాయక్(MP Balaram Nayak) “అధికారంలో ఉన్నది మీరే కదా? మీ సొంత పార్టీ ఎంపీనే మన జిల్లాకు అన్యాయం చేస్తుంటే, కనీసం ప్రశ్నించే దమ్ము, ధైర్యం మీకు లేవా?” అని ఎద్దేవా చేశారు. కేవలం పైరవీలకు, ప్రోటోకాల్‌లకు పరిమితమైన ఎమ్మెల్యే, ఎంపీల నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మహబూబాబాద్ జిల్లాకు ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తుపై దెబ్బ:
ఈ రైల్వే డిపో కేవలం ఒక భవనం కాదని, ఇది జిల్లా యువత భవిష్యత్తు అని ఫరీద్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉంటే స్థానికంగా వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకుల స్వార్థం వల్ల మన యువత ఉపాధి అవకాశాలు నష్కల్ పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని, డిపోను యథాతథంగా మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. మా జిల్లా జోలికొస్తే ఊరుకోం. మహబూబాబాద్ హక్కులను కాపాడేందుకు బిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ సైనికులుగా ఎంతవరకైనా పోరాడుతాం.” అవసరమైతే రైల్ రోకోలు, రాస్తారోకోలతో జిల్లాను స్తంభంపజేస్తామని హెచ్చరించారు. ఈ కుట్రను భగ్నం చేసేందుకు జిల్లా ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు.
Also Read: Inspire Science Fair: మెదక్‌లో ముగిసిన సైన్స్ఫెయిర్.. విజేతలకు సర్టిఫికెట్స్ అందజేత..!

