Indigo Cancellations: పైలట్ల కొరత, కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్‌డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన ‘ఇండిగో ఎయిర్‌లైన్స్’ (Indigo Airlines) విమాన సర్వీసుల్లో గత మూడు రోజులుగా తీవ్ర అవాంతరాలు (Indigo Cancellations) ఎదురవుతున్న విషయం తెలిసింది. ఈ పరిస్థితులు శుక్రవారం నాటికి పతాక స్థాయికి చేరి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో పీటర్ ఎల్బర్స్ శుక్రవారం తన మొదటి ప్రకటన విడుదల చేశారు. విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర గందరగోళాన్ని ఆయన అంగీకరించారు. విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి మరో ఐదు రోజులు పట్టవచ్చని ఆయన చెప్పారు. డిసెంబర్ 15లోగా సర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వివరించారు.
గత కొన్ని రోజులుగా తాము తీవ్రమైన ఆపరేషనల్ ఇబ్బందులను చవిచూస్తున్నట్టు తెలియజేయాలనుకుంటున్నట్టు చెప్పారు. సర్వీసుల రద్దు సంక్షోభం తీవ్రమవుతూనే ఉందని, శుక్రవారం నాడు అత్యంత తీవ్రంగా సర్వీసులు ప్రభావితమయ్యాయని, రద్దయిన విమానాల సంఖ్య వెయ్యికి పైగా ఉందని తెలిపారు. ఇండిగో రోజువారీగా నడిపే విమానాల సంఖ్యలో సగానికి పైగా సర్వీసులు నిలిచిపోయాయని ఎల్బర్స్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
శుక్రవారం 1000 విమానాలు రద్దు
ఒక్క శుక్రవారం నాడే (డిసెంబర్ 5) 1,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయని ఎల్బర్స్ ధృవీకరించారు. శుక్రవారం నాడు విమానాలు అతి తీవ్రంగా ప్రభావితం అయ్యాయని వివరించారు. ఇండిగో ‘ఆపరేషనల్ సిస్టమ్’ను రీబూట్ చేయడంతోనే ఈ తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఎల్బర్స్ చెప్పారు. ప్రయాణికులు మరింత అసౌకర్యానికి గురికాకుండా ఉండాలని, ప్యాసింజర్లు ఎయిర్‌పోర్టులకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా ఇండిగో తీవ్రమైన ఆపరేటింగ్ సవాళ్లను ఎదుర్కొందని, అయితే, సాధారణ స్థితిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విమాన సర్వీసుల్లో కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్టు ఎల్బర్స్ పేర్కొన్నారు.
ఇండిగో సమస్యలు ఇవే
విమాన సిబ్బంది, ముఖ్యంగా పైలట్ల కొరత ఇండిగోకు ప్రధాన సమస్యగా మారింది. కొత్తగా ఎఫ్‌డీటీఎల్ (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలను అమలులోకి తీసుకురావడం ఇందుకు దారితీసింది. కొత్త నిబంధనల ప్రకారం, పైలట్లకు ఒక వారంలో తీసుకునే విశ్రాంతి సమయాన్ని పెంచింది. అంతేకాదు, వీక్ రెస్ట్‌ను సెలవుగా పరిగణించకూడదని, ఈ మేరకు మస్టర్ రోల్స్‌ను అమలు చేయాలని డీజీసీఏ కొత్త నిబంధనలు స్పష్టం చేశాయి. అలాగే రాత్రిపూట విమానం నడపడానికి (Night Landings) పరిమితులను కూడా విధించింది. దీంతో, విమానాలను నడపడానికి అవసరమైన పైలట్ల సంఖ్య బాగా తగ్గింది. ఇండిగో మేనేజ్‌మెంట్ ఈ సమస్యను తగిన రీతిలో అంచనా వేయలేకపోవడం ఈ దారుణ పరిస్థితికి దారితీసింది.

