PDS Rice Scam: జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్(Venugopal) పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అదనపు కలెక్టర్ వివరించిన ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు 02.12.2025 న సాయంత్రం సుమారు 4:15 గంటల సమయంలో జి.సి.సి.ఎస్ మాండల్ లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్‌ఎస్ పాయింట్), పాల్వంచలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ 20 ఏవి 1899 (బజాజ్ పల్సర్) నెంబర్ గల మోటార్ సైకిల్‌పై వచ్చిన యువకుడు త్వరలోనే స్టాక్ పాయింట్‌లోకి ప్రవేశించి, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్ సత్యవతి మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ బనోత్ కృష్ణకుమార్(Banoth Krishnakumar)కు పత్రాలు అందజేయగా, వారు కొంత సమాచారం నమోదు చేసి తిరిగి ఆయనకు అందించారు. ఈ పరిణామంపై అనుమానంతో అధికారులు ప్రధాన గేటు వద్ద అతడిని ఆపి విచారించగా, అతడి పేరు ప్రసాంత్ అని, ఆయన స్టేజ్–I కాంట్రాక్టర్ ఎన్. శ్రీనివాస్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు.
నకిలీ ఎంట్రీలు చేసి..
ప్రశాంత్ వెల్లడించిన ప్రకారం, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామ్, మల్లారం నుండి సరఫరా కావాల్సిన పిడిఎస్ ‘సన్న బియ్యం’ను, మోటార్ సైకిల్ ద్వారా GPS ట్రాకింగ్ వ్యవస్థను మార్చి, లారీ నం. TS29T 5139కు సంబంధించిన ట్రక్ చిట్ నంబర్ 4346తో కలిసి జి.సి.సి. స్టాక్ పాయింట్‌కు తెచ్చి, అక్కడ ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది కలయికతో నకిలీ ఎంట్రీలు చేసి తిరిగి పంపారని నిర్ధారించారు. దీంతో అసలు లారీలో ఉన్న 600 సంచుల పిడిఎస్ బియ్యం (300 క్వింటాళ్లు) నల్లబజారుకు మళ్లించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది మరియు పిడిఎస్ డీలర్లు కలిసి పత్రాలలో తప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారు. పంచనామా మరియు స్వీకార వాంగ్మూలాల ఆధారంగా ప్రసాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
స్టేజ్–I కాంట్రాక్టర్‌ను కూడా గుర్తింపు
తదుపరి దర్యాప్తులో స్టేజ్–I కాంట్రాక్టర్ ఎన్. శ్రీనివాస్(N Srinivas)ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆయన తన భార్య ఎన్. సరోజా(Saroja) పేరుతో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారని, మణుగూరు చెందిన రైస్ మిల్లర్ నరహరి (ఎం/స్ రమ్యా రైస్ ట్రేడర్స్)కు పిడిఎస్ బియ్యం మళ్లించేందుకు GPS ట్రాకింగ్ వ్యవస్థను మార్చి లారీలను అతని మిల్లుకు తరలించేవారని ఒప్పుకున్నారు. ప్రతి లారీకి రూ.50,000/- చొప్పున ఐదు మార్లు పంపినట్లు చెప్పారు.
అదుపులోకి లారీ డ్రైవర్..
TS29T 5139 నెంబర్ గల లారీని నగిరిపేట అవుట్‌స్కర్ట్స్‌లో గుర్తించి, డ్రైవర్ అనిల్ కుమార్‌ను విచారించగా, రైస్ మిల్లర్ సూచనల మేరకు లారీ నిలిపివేసినట్లు అంగీకరించాడు. లారీ స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో పిడిఎస్ బియ్యం రికవరీ చేశారు. తదుపరి దర్యాప్తులో ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్ సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కృష్ణకుమార్ ఇద్దరూ ఒప్పుకుని, హమాలి నాగరాజు సహకారంతో పలు ఫేర్‌ప్రైస్ షాప్ డీలర్ల ఒత్తిడికి లోనై నకిలీ ఎంట్రీలు చేసినట్లు వెల్లడించారు. డీలర్లు పిడిఎస్ బియ్యం అందుకున్నట్లుగా బయోమెట్రిక్ సంతకాలు చేసి, అసలు బియ్యం మాత్రం పొందలేదని తేలింది. లారీకి నకిలీ రసీదుల కోసం ఎంఎల్‌ఎస్ సిబ్బంది లంచాలు కూడా స్వీకరించినట్లు విచారణలో తెలిసింది.
మొత్తం దర్యాప్తు వివరాలు
పిడిఎస్ బియ్యం మళ్లింపులో ఒక మాఫియా రింగ్ పనిచేస్తున్నట్లు భారీ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని, ఈ వ్యవహారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ (316(5)), మిస్‌చీఫ్ (324(3)), మోసం (318(5)), క్రిమినల్ కుట్ర (61(2) BNS) కింద నేరమని తగిన సాక్ష్యాలతో నిర్ధారించబడింది. అలాగే వారు ఎస్సెంటిల్ కామడిటీస్ యాక్ట్ –1955, తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (కంట్రోల్) ఆర్డర్ –2016 నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమైంది.
చట్టపరమైన చర్యలు
ఈ వ్యవహారంపై సంబంధిత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు నమోదు చేసాము. సంబంధిత చట్టాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టబడనున్నాయి. ఈ సమావేశంలో డిసిఓ ప్రేమ్ కుమార్(DCO Prem Kumar), పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు(Trinath Babu), అంజయ్య ఓఎస్ డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rangareddy Politics: లోకల్ ఎన్నికల్లో సిద్ధాంతాలకు తిలోదకాలు.. పార్టీలతో పనిలేదు, బల నిరూపణే ముఖ్యం!

