Indigo flight Cancellations: దేశీయ విమానయాన రంగ దిగ్గజం ‘ఇండిగో’ (Indigo) విమాన సర్వీసుల్లో అంతరాయ పరిస్థితులు (Indigo flight Cancellations) శుక్రవారం నాడు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇవాళ (డిసెంబర్ 5) ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 700లకు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దీంతో, దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నపళంగా ఇన్ని సర్వీసులను రద్దు చేసి తమను ఇబ్బందుల్లోకి నెట్టారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో తీవ్రమైన ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఎయిర్‌పోర్టుల్లో భారీ లగేజీలు, కనీసం నిలబడడానికి వీలులేని విధంగా సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రంగంలోకి దిగిన కేంద్రం
పెద్ద సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, ఎయిర్‌పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Centrav Govt) రంగంలోకి దిగింది. ఇండిగో విమాన సర్వీసులు సజావుగా కొనసాగేందుకు వీలుగా కొన్ని నిబంధనల విషయంలో ఇండిగోకు తాత్కాలిక మినహాయింపు ఇస్తూ డీజీసీఏ (DGCA) ప్రకటన చేసింది. పైలట్లకు వీక్లీ రెస్ట్ (Weekly Rest) నిబంధనను ఉపసంహరిస్తున్నట్టుగా పేర్కొంది. అంటే, పైలట్లకు వీక్లీ రెస్ట్‌ను (వారంవారీ విశ్రాంతి) కూడా సెలవుగా పేర్కొనవచ్చని, ఈ నిబంధన తాత్కాలికంగా వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
నవంబర్ 1న ప్రవేశపెట్టిన ఫైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల ప్రకారం, పైలట్ల వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించకూడదని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేకాదు, కనీస విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. ఈ చర్యల ద్వారా పైలెట్లపై అలసట తగ్గుతుందని భావించింది. అయితే, ఈ నిబంధనతో విశ్రాంతి తీసుకునే పైలెట్ల సంఖ్య పెరిగిపోవడంతో, ఇండిగో షెడ్యూల్, రోస్టరింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రమైన పైలట్ల కొరత ఎర్పడింది. పర్యావసానంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడడంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తూ డీజీసీఏ వెసులుబాటు కల్పించింది.
Read Also- Live-in Relationship: పెళ్లి వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు.. రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కాగా, సవరించిన ఎఫ్‌డీటీఎల్ రూల్స్ విషయంలో మినహాయింపు ఇవ్వాలంటూ ఇండిగో కోరిన నేపథ్యంలో డీజీసీఏ ఈ సడలింపు ఇచ్చింది. మరోవైపు, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్య ల్యాండింగ్స్ పరిమితిని కూడా సడలించాలని ఇండిగో కోరింది. అయితే, ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలుకు అనుగుణంగా ఇండిగో సరైన ఏర్పాట్లు చేసుకోలేకపోయిందని, అందుకే ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. పైలట్లకు రాత్రి డ్యూటీ నిబంధనల విషయంలో కూడా ఈ ఒక్కసారి మినహాయింపు ఇచ్చింది.
కాగా, నాలుగు రోజులుగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దు కావడం, లేదా ఆలస్యం అవ్వడం తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి బయలుదేరే ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్నింటినీ అర్ధరాత్రి వరకు, చెన్నైలో విమానాలతగ సాయంత్రం 6 గంటల వరకు రద్దు చేస్తూ శుక్రవారం నాడు ఇండిగో ప్రకటన చేసింది. పర్యావసానంగా మిగతా ఎయిర్‌లైన్ సంస్థలు ఛార్జీలను భారీగా పెంచేశాయి.
వీక్లీ రెస్ట్ తప్పనిసరిగా అంటూ కొత్త తీసుకొచ్చిన నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకోవడంపై పైలట్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్యాసింజర్లకు అసౌకర్యం కలగకుండా కార్యకలాపాలను సజావుగా కొనసాగేందుకు సహకరించాలని డీజీసీఏ విజ్ఞప్తి చేసినప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

