Indigo Operations: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (Indigo Operations) సర్వీసుల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గురువారం కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏకి చెందిన సీనియర్ అధికారులతో కలిసి ఆయన ఇండిగో కార్యకలాపాలకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. నెట్‌వర్క్‌ను నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయాలను ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరినట్టు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న ప్రయాణీకులకు అన్ని సహాయాలను అందించాలని, అన్ని విమానాశ్రయాల నిర్వాహకులను ఆదేశించినట్టు రామ్మోహన్ నాయుడు వివరించారు.
200లకు పైగా విమానాలు రద్దు
వరుసగా రెండవ రోజు కూడా ఇండిగో సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. గురువారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడం, లేదా ఆలస్యం కావడం జరిగాయి. విమానాశ్రయాలలో ప్యాసింజర్లు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 200కి పైగా విమానాలు రద్దయ్యినట్టు అంచనాగా ఉంది. బుధవారం కూడా 150కి పైగా సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే.
Read Also- Mythri Movie Makers: ఇళయరాజాతో ఇష్యూ.. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతకి సెటిల్ చేసుకున్నారంటే?
ప్రధాన కారణాలు ఇవే
ఇండిగో విమానాలు ఆలస్యం, రద్దు కావడానికి పలు కారణాలు ఉన్నాయి. కొత్త డీజీసీఏ నిబంధనలు (FDTL) కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్తగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ రూల్ ప్రకారం, పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ఎక్కువగా విశ్రాంతి సమయం ఇవ్వడం తప్పనిసరిగా ఉంది. ఈ నిబంధనలకు అనుగుణంగా తమ భారీ విమాన నెట్‌వర్క్ షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవడంలో ఇండిగో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా, తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు
చిన్నపాటి సాంకేతిక లోపాలు కూడా ఇండిగో విమానాలను కొన్ని సందర్భాల్లో రద్దుకు, ఆలస్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా, ఎయిర్‌బస్ ఏ320 విమానాలకు సంబంధించిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ రూల్స్, భద్రతా కారణాల మరికొన్ని విమానాలను తాత్కాలికంగా సర్వీసుకు దూరంగా ఉంచాల్సి వస్తోంది. మరోపక్క వాతావరణ పరిస్థితులు కూడా విమాన సర్వీసులను దెబ్బతీస్తున్నాయి. శీతాకాలం కావడంతో కొన్నిసార్లు తీవ్రమైన పొగమంచు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా షెడ్యూల్ కూడా ప్రభావితం అవుతోంది.
Read Also- Teenmar Mallanna Office: మల్లన్న ఆఫీస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం!.. కారణం ఇదేనా?
ఇండిగో క్షమాపణలు
ఇంత పెద్ద సంఖ్యలో విమానాల సర్వీసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలపై ఇండిగో ఎయిర్‌లైన్స్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్షమించాలంటూ ప్యాసింజర్లను కోరింది. గత రెండు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు తీవ్ర అంతరాయానికి గురైన విషయం నిజమేనని, ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని పేర్కొంది. రద్దయిన విమానాలకు సంబంధించి టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్యాసింజర్లకు రీఫండ్ అందజేస్తామని ఇండిగో తెలిపింది. ఇక, విమాన సర్వీసులను వీలైనంత త్వరగా సాధారణ స్థితీకి తీసుకొచ్చి, సేవలను పునరుద్ధరించడానికి తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందే తమ ప్లైట్ స్టేటస్‌ను ముందుగానే చూసుకోవాలని ప్యాసింజర్లకు ఇండిగో ఒక సూచన చేసింది.
