Local Polls: కేరళ స్థానిక ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరుకు (Local Polls) తెరలేచింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేరుతో ఉన్న ఓ మహిళ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ పేరు పెట్టుకుని పోటీ చేస్తున్న ఆ మహిళను విమర్శించలేక, విస్మరించలేక స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో ఒకింత ఇబ్బంది పడుతున్నారు. ఆసక్తికరమైన ఈ స్థానిక పోరు కేరళలోని మున్నార్‌లో చోటుచేసుకుంది.
సోనియా గాంధీ పేరున్న అభ్యర్థి పోటీ చేయడంతో యూడీఎఫ్ (కాంగ్రెస్ కూటమి) అభ్యర్థికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్నార్ గ్రామ పంచాయతీలోని 16వ వార్డు నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేస్తోంది. ఆమె తండ్రి, దివంగత దురై రాజ్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. బతికి ఉన్నప్పుడు ఒక ప్లాంటేషన్ కార్మికుడు, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా స్థానిక ఆఫీస్ బేరర్‌గా విధేయతతో పనిచేశారు. పార్టీపై అభిమానంతో తన కూతురుకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పేరు పెట్టారు. కానీ, విచిత్రంగా, కొన్ని దశాబ్దాల కాలం గడిచిపోయిన తర్వాత, ఆ మహిళ ప్రస్తుతం బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తోంది.
Read Also- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
నిజానికి సోనియా గాంధీ చాన్నాళ్లపాటు కాంగ్రెస్ మద్దతుదారుగానే కొనసాగారు. అయితే, బీజేపీకి చెందిన పంచాయతీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత, ఈ అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. మొత్తానికి సోనియా గాంధీ ప్రచారం కాంగ్రెస్ ప్రచారకర్తలను ఒకింత గందరగోళానికి గురిచేస్తోందట. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి మంజుల రమేష్‌పై సోనియా పోటీ చేస్తున్నారు. ఈ పోటీపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో స్థానికంగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ కార్యకర్తలకు సవాలు
సోనియా గాంధీ పేరున్న మహిళ స్థానికంగా పోటీ చేస్తుండడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకింత సవాలుగా మారిందట. బీజేపీ తరపున పోటీ చేస్తున్నా, ఆమె తండ్రి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది కావడంతో కాంగ్రెస్ మద్దతుదారుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోందట. కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు పడే సూచనలు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. దీంతో, కాంగ్రెస్ అభ్యర్థిలో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థి కోరుతున్న పరిస్థితి ఏర్పడింది. ఆమెను తీవ్రంగా విమర్శిస్తే, తమ అగ్ర నాయకత్వంతో ముడిపడి ఉన్న పేరును విమర్శించినట్లుగా ప్రజలు భావించే ప్రమాదం ఉందని, ఆచితూచి వ్యవహారించాలని స్థానిక హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇక, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం కానీ, సోనియా గాంధీ పేరున్న మహిళ స్థానికంగా పోటీ చేయడం ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
Read Also- Cyber Crime: కొంపలు ముంచిన ఏపీకే ఫైళ్లు.. ఒక్క క్లిక్‌తో రూ.లక్షల్లో స్వాహా!
