Cyber Crime: ఏపీకే ఫైళ్లు పంపించి సైబర్ క్రిమినల్స్ హైదరాబాద్ కు చెందిన ముగ్గురి నుంచి డబ్బు కొల్లగొట్టారు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శక్కర్ గంజ్ ప్రాంతానికి చెందిన 58ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసిన అపరిచితుడు తనను తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు. సరైన టైంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు చెయ్యని కారణంగా విధించిన పెనాల్టీ మొత్తాన్ని రద్దు చేస్తానని చెప్పి ఓ ఏపీకే ఫైల్ పంపించాడు. బాధితుడు ఫైల్ ఓపెన్ చెయ్యగానే అతని ఫోన్ ను తన కంట్రోల్ లోకి తీసుకున్న సైబర్ క్రిమినల్ అతని ఖాతా నుంచి 1.72లక్షలు కొట్టేశాడు.
మరో సంఘటనలో పటేల్ నగర్ లో ఉంటున్న 45ఏళ్ల వ్యక్తికి ఇలాగే ఫోన్ చేసిన సైబర్ మోసగాడు తనను తాను ఐడీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగింది అని చెప్పి వాట్సాప్ ద్వారా ఓ లింక్ పంపాడు. దాంట్లో క్రెడిట్ కార్డు నెంబర్, ఇతర వివరాలు పూర్తి చెయ్యమన్నాడు. బాధితుడు అలా చెయ్యగానే అతని ఖాతా నుంచి 2.95లక్షలు కొట్టేశాడు.
Also Read: MP Chamala: సీనియర్ టీచర్లకు టెట్ తిప్పలు.. లోక్ సభలో ఎంపీ చామల కీలక ప్రసంగం
యాఖుత్ పురాకు చెందిన వ్యక్తికి ఆర్టీఓ చాలాన్ పేర ఏపీకే ఫైల్ పంపించిన మోసగాడు ఆ ఫైల్ ను బాధితుడు ఇన్ స్టాల్ చెయ్యగానే 2.26లక్షలు కొట్టేశాడు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన 58ఏళ్ల వ్యక్తికి ఇండస్ ఇండ్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. సైబర్ క్రిమినల్ అతని ఫోన్ కు ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పేర ఏపీకే ఫైల్ పంపాడు. దాన్ని క్లిక్ చెయ్యగానే అతని అకౌంట్ల నుంచి 1.31లక్షలు కొట్టేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
