Hyderabad House History: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) రెండు రోజుల భారత పర్యటన (Putin India Visit) కోసం గురువారం (డిసెంబర్ 4) న్యూఢిల్లీలో అడుగుపెడుతున్నారు. భారత్ – రష్యా ద్వైపాక్షిక వార్షిక సదస్సు కోసం విచ్చేసిన ఆయన, శుక్రవారం నాడు (డిసెంబర్ 5) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. చాలా కీలకం కాబోతున్న ఈ భేటీకి, చారిత్రాత్మక ‘హైదరాబాద్ హౌస్’ (Hyderabad House) వేదిక కాబోతోంది. అదేంటి!!, ఢిల్లీలో ‘హైదరాబాద్ హౌస్’ (Hyderabad House History) ఎలా సాధ్యం?, అక్కడ ఎవరు నిర్మించారు?, ఎందుకు కట్టించారు?. దీనివెనుకున్న కారణాలు ఏమిటి? అనే డౌట్స్ వస్తున్నాయా?.. అయితే, ఈ కథనం చదవాల్సిందే.
ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ చరిత్ర పెద్దదే!
హైదరాబాద్ చివరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ పాలన 1911లో మొదలై 1948 వరకు కొనసాగింది. సరిగ్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన ఏడాదే బ్రిటీష్ ఇండియా రాజధాని కోల్‌కతా నగరం నుంచి ఢిల్లీ నగరానికి షిఫ్ట్ అయ్యింది. రాజధానిని ఢిల్లీకి మార్చుతున్నట్టుగా 1911 డిసెంబర్ 12న ఐదవ కింగ్ జార్జ్ ప్రకటన చేశారు. ఆ రోజుల్లో బ్రిటీష్ ఇండియాతో సత్సంబంధాలు కలిగివున్న పలు సంస్థానాల అధిపతులు కూడా ఢిల్లీలో తమకు సొంత నివాసం ఉంటే బావుంటుందని భావించారు. ఢిల్లీ నిర్మాణానికి ప్రణాళికా మ్యాప్‌లు సిద్ధం చేస్తున్న సమయంలో, చాలా మంది రాజులు తమ మనసులో మాటను బ్రిటీష్ ఇండియాకు తెలియజేశారు. సంస్థానాధిపతుల ఆలోచనను నాటి వైస్రాయ్ కూడా చాలా సంతోషంగా స్వాగతించారు. సంస్థానాలు తమ వెనుకే ఉన్నాయని ఆయన సంతోషించారు. దీంతో, మిగతా సంస్థానాల మహారాజుల మాదిరిగానే ఢిల్లీలో తనకు కూడా ఒక నివాసం ఉండాలని భావించిన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలోచనలోంచి పుట్టినదే చారిత్రాత్మక హైదరాబాద్ హౌస్ (Hyderabad House).
తన కీర్తికి తగ్గట్టుగా..
ఆ రోజుల్లో మిర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎంత ధనవంతుడంటే, ఆయన వద్ద ముత్యాలతో చిన్నపాటి కొన్ని కొలనులను నింపేయవచ్చని చెప్పుకునేవారట. ఆయనకు ఆస్తులు, రాజభవనాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో, తన కీర్తికి సరిపోయేలా, బ్రిటీష్ ఇండియా పాలకులకు ఏమాత్రం తగ్గకుండా ఢిల్లీలో తన నివాసాన్ని నిర్మించుకోవాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భావించారు. అందుకుతగిన స్థలాన్ని ఆయన ఎంచుకున్నారు.
వైస్రాయ్ హౌస్ నుంచి 3 కి.మీ.
ఢిల్లీలో తన నివాసం రాజదర్పణానికి ఏమాత్రం తీసిపోకూడదని భావించిన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అభ్యర్థన చేశారు. అదేంటంటే, వైస్రాయ్ హౌస్ దగ్గర, ప్రిన్సెస్ పార్క్‌లో స్థలం కావాలని ఆయన కోరారు. అందుకు, బ్రిటిష్ పాలకులు ఒప్పుకోలేదు. దీంతో, వైస్రాయ్ హౌస్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఐదవ కింగ్ జార్జ్ విగ్రహం చుట్టూ ఉన్న స్థలం కేటాయించారు. ఈ స్థలంలో రదిోు హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా, బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ సంస్థానాల రాజులకు కూడా కేటాయించారు.
వాస్తు శిల్పికి బాధ్యతలు
స్థానాలు పొందిన ఈ 5 సంస్థానాలలో హైదరాబాద్ నిజాంతో పాటు బరోడా గైక్వాడ్‌లు తమ నివాసాలను రూపొందించే బాధ్యతను ప్రఖ్యాత వాస్తుశిల్పి ఎడ్విన్ ల్యూటెన్స్‌కు (Edwin Lutyens) అప్పజెప్పారు. వైస్రాయ్ హౌస్ మాదిరిగానే అద్భుతంగా ఉండాలని వాస్తుశిల్పికి సూచించారు. అయితే, ఈ రాజభవనాల డిజైన్ల రూపకల్పనలను బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదించాలి. నిజం రాజు కోరుకున్నట్టుగా అంగీకరించకపోవడంతో వైస్రాయ్ భవనం మాదిరిగా హైదరాబాద్ హౌస్‌ను రూపొందించలేకపోయారు. దీంతో, వైస్రాయ్ హౌస్ మధ్యలో ఉండే ఒక్క గోపురం డిజైన్‌ను మాత్రమే హైదరాబాద్ హౌస్ నిర్మాణం కోసం ఉపయోగించారు. చివరికి సీతాకోకచిలుక ఆకారంలో దీనిని నిర్మించారు.
Read Also- Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!
36 గదులు.. నిర్మాణ ఖర్చు ఎంతంటే?
1920ల కాలంలో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి ఆ రోజుల్లోనే ఏకంగా రూ.2.40 కోట్లకుపైగా భారీ ఖర్చు అయ్యింది. అదే 2023లో ఈ భవనాన్ని నిర్మించి ఉంటే రూ.170 కోట్ల వరకు ఖర్చయ్యేదని అంచనాగా ఉంది. అనుమతి లేకపోవడంతో వైస్రాయ్ హౌస్‌కు తగ్గట్టుగా మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన నివాసాన్ని నిర్మించుకోలేకపోయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నిజాంగా తన ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో హైదరాబాద్ హౌస్‌ను నిర్మించుకున్నారు. ఈ హౌస్‌లో మొత్తం 36 గదులు ఉన్నాయి. మొఘల్ శైలి నిర్మాణ పోలికలు భవనంలో కనిపిస్తాయి. యూరప్ శైలిలో మెరుగులు, తోటలు, ఆకర్షణీయమైన తోరణాలు, అద్భుతంగా అనిపించే మెట్లు, ఫౌంటెన్‌లు కనిపిస్తాయి. అందుకే, ఈ భవనం ఇతర సంస్థానాలతో పోల్చితే చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ భవనం ఇండియా గేట్‌కు సమీపంలో 8.2 ఎకరాలలో విస్తరించి ఉంటుంది.
అయితే, ఈ భవాన్ని నిజాం అరుదుగా ఉపయోగించేవారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడంతో, సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కావడం మొదలయ్యాయి. కానీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం అందుకు ససేమిరా అని చెప్పింది. దీంతో, కేంద్ర ప్రభుత్వ రంగంలోకి దిగి ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేసింది. దీంతో, హైదరాబాద్ హైస్‌ను మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులు స్వల్పకాలం ఉపయోగించారు. వారి ద్వారా హైదరాబాద్ హౌస్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా భారతదేశ ఆస్తిగా రూపాంతరం చెందింది. ఇక, 1970వ దశకం ప్రారంభంలో భారతదేశానికి దౌత్య అవసరాలు పెరిగిపోవడంతో విదేశీ అతిథుల పర్యటనలు, విందుల కోసం కేటాయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేటరింగ్, నిర్వహణ, ఇతర కార్యక్రమాలను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) నిర్వహించింది.
Read Also- Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన
