Hidma Encounter: హిడ్మా, టెక్ శంకర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్
మూడు రోజులపాటు హింసించి హత్య చేశారు
కలప వ్యాపారులు, కాంట్రాక్టర్లు మోసం చేశారు
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట సంచలనం లేఖ విడుదల
మహబూబాబాద్, స్వేచ్ఛ: మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతడి సహచరుడు శంకర్ సహా మొత్తం 13 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను (Hidma Encounter) నక్సల్స్ జీర్ణించుకోలేపోతున్నారు. ఇవి ముమ్మాటికీ హత్యలేనంటూ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేయగా, తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట మరో లేఖ విడుదల చేశఆరు. రెండు రోజుల వ్యవధిలో హిడ్మా సహా 13 మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్ చేయడం బూటకమని, హతమార్చారని ఆరోపించారు. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా, మరో ఐదుగురు నక్సల్స్‌ను నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి, మూడు రోజులపాటు దారుణంగా హింసించి, ఆపై హత్య చేశారని లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 27న కామ్రేడ్ హిడ్మా అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం ఒక కలప వ్యాపారితో విజయవాడకు వెళ్లినట్లు వివరించారు. ఆ తర్వాత కొంతమంది సహచరులు కూడా హిడ్మాతో పాటు వెళ్లారని వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆరుగురిని 25 మంది పోలీసులు అరెస్టు చేసి, చంపారని ఆరోపించారు.
నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు మావోయిస్టులను హతమార్చి, ఎన్‌కౌంటర్ చేసినట్టుగా ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 19న అదే ఘటనలో ఏవోబీ-ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ సహా మరికొందర్ని మరో ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని పేర్కొన్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో ఊచకోతలో అమరులైన 13 మంది సహచరులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవాత్మక వందనం అర్పిస్తుందని పేర్కొన్నారు. వారి లక్ష్యాల కోసం మరణం వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 9న కోసల్ అనే తమ సభ్యుడు ఒకరు దళాల నుంచి తప్పించుకున్నాడని, అతడు నేరుగా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు పేర్కొన్నారు.
హిడ్మా, టెక్ శంకర్ సహా 13 మంది హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఎన్‌కౌంటర్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ దేవ్ జి, మనీష్ కుంజ, సోనీ సోడి చేసిన తప్పుడు ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
కలప వ్యాపారులు, కాంట్రాక్టర్ల మోసం
హిడ్మాతో పాటు కీలక మావోయిస్టులను చంపేసిన ఎన్‌కౌంటర్ల తర్వాత విజయవాడ, ఎన్టీఆర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం వెనుక ఉన్నవారిపై మావోయిస్టులు సందేహం వ్యక్తం చేశారు. విజయవాడ కలప వ్యాపారులు, ఫర్నిచర్ డీలర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐటీడీఏ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు చేసిన ద్రోహమే అరెస్టుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. కామ్రేడ్ దేవ్ జి, సంగ్రామ్ అలియాస్ మల్లా రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేదని, వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో రాజీపడలేదని, అదేవిధంగా హిడ్మా గురించి దేవ్ జి సమాచారం అందించలేదని స్పష్టం చేశారు. ఈ సత్యం అంతా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల నిఘా సంస్థలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థల సమన్వయంతో మోస్ట్ వాంటెడ్ హిడ్మా, శంకర్‌తో పాటు 13 మంది హత్యకు గురయ్యారని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌కు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆపరేషన్‌గా ఆరోపించారు. ఈ ఆపరేషన్ వెనుక ప్రధాన సూత్రదారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అని ఆరోపించారు. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట ఈ లేఖ విడుదల చేశారు.
లొంగిపోయేలా చేయడానికి హిడ్మాతో పాటు 50 మందిని దేవ్ జి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లాడని లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్ దేవ్ జి అరెస్ట్ అయిన తర్వాత తన ప్రాణాలను కాపాడుకోవడానికి హిడ్మా సమాచారాన్ని పోలీసులకు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కామ్రేడ్ హిడ్మా, అతడి ఇతర సహచరులు పోలీసు ఇన్‌ఫార్మర్లతో ఉన్నారని తెలుసుకొని, వాళ్లను హత్య చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి పువ్వర్తికి వెళ్లారని, అక్కడ హిడ్మా తల్లి దగ్గరికి వెళ్లి కొడుకు లొంగిపోవాలని కోరుతూ ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారని చెప్పారు. హిడ్మా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోడని పూర్తిగా తెలిసిన ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వాళ్ల అమ్మ నుంచి లొంగిపోవాలని వాంగ్మూలం ఎందుకు తీసుకున్నారని ఆరోపించారు. హిడ్మా తల్లికి విజ్ఞప్తి చేసినప్పటికీ, హిడ్ ను ఎన్‌కౌంటర్ చేశారని పేర్కొన్నారు. హిడ్మా లొంగిపోతాడంటూ దుష్ప్రచారం చేసి, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చేసిన దృష్టకుట్ర అని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత విజయవాడ, ఏలూరు, కాకినాడలలో పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపించిన వారిని విడుదల చేసి వారికి న్యాయ సహాయ అందించాలని అభ్యర్థించారు. ఈ లేఖను గత నెల 27న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట విడుదలవ్వగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
