Viral Video: బిహార్ లోని బోధ్ గయాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం తీవ్ర ఘర్షణ జరిగింది. వధువు, వరుడి బంధువులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పెళ్లి మండపం రణరణంగా మారింది. పరస్పర దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాకవుతున్నారు.
అసలేం జరిగిందంటే?
నవంబర్ 29న జరిగిన పెళ్లి వేడుకలో ఈ రణరంగం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. విందు కోసం చేసిన రసగుల్లాలు అయిపోవడంతో వధూవరుల బంధువుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందులో ఇరుపక్షాల బంధువులు పాల్గొని వివాదాన్ని మరింత పెద్దది చేశారు. కుర్చీలను గాల్లోకి ఎగరేసి మరి కొట్టుకోవడం వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.
Chaos After ‘Rasgulla Shortage’ At Bihar Wedding pic.twitter.com/Rks41zJtnq
— Priyanka Koul (@Priyankakaul13) December 3, 2025
వరుడిపై వరకట్నం కేసు
అయితే గొడవ జరుగుతున్న సమయంలోనే వధూవరులు అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక్కసారిగా గొడవ పెద్దది అయిపోవడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వరుడిపై అమ్మాయి బంధువులు వరకట్నం కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఘటనపై పోలీసుల స్పందన రావాల్సి ఉంది.
Also Read: Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?
హరిద్వార్ లోనూ ఇంతే..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమం సమయంలో గొడవ చెలరేగడంతో ఒక మహిళ తన పెళ్లిని రద్దు చేసుకుంది. వధువు ఊరేగింపు కోసం వచ్చిన మగ పెళ్లి వారిని వెనక్కి పంపేసింది. అంతకుముందు వరుడు స్నేహితులు.. వధువుకు సంబంధించిన మహిళా బంధువులను దుర్భాషలాడినట్లు సమాచారం. దీనిపై వధువు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సైతం అప్పట్లో వైరల్ గా మారాయి.
