Pakistan Airlines: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దయాది దేశం పాకిస్థాన్.. దాని నుంచి బయటపడేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ విమాయన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (PIA)ను డిసెంబర్ 23న అమ్మకానికి పెట్టబోతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా నష్టాల్లో పీఐఏను అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ల (రూ. 63,220 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు ప్రైవేటీకరించబోతున్నారు. గత 20 ఏళ్లల్లో పాక్ చేయబోతున్న అతిపెద్ద విక్రయం ఇదేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఐఎంఎఫ్ ఒత్తిడికి తలొగ్గి..
1946లో కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా పీఐఏను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. ఒకప్పుడు అంతర్జాతీయ విమాన సేవలతో మంచి లాభాలను గడించిన పీఐఏ.. గత కొన్నేళ్లుగా నష్టాలు, అప్పులు, ఆపరేషన్స్ నిర్వహణలో లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. గత ఏడాదే పీఐఏను విక్రయించాలని పాక్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో బిడ్లు రాకపోవడంతో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పొందేందుకు పీఐఏ విక్రయం అనివార్యంగా మారింది. దీంతో ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణకు పాక్ సిద్ధమైంది.
బిడ్డింగ్‌పై ఆసీమ్ మునీర్ ప్రభావం..
ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటికే బిడ్లను సైతం పాక్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటివరకూ నాలుగు బిడ్లు దాఖలు కాగా అందులో పాక్ ఆర్మీ చీఫ్ మద్దతుతో నడుస్తున్న ఫౌజీ ఫౌండేషన్ (Fauji Foundation) కూడా ఉంది. ప్రస్తుతం పాక్ లో అత్యంత శక్తివంతమైన ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్న ఆసీం మునీర్ కు ఫౌజీ ఫౌండేషన్ పై బలమైన పట్టు ఉంది. ఆయన ఈ ఫౌండేషన్ లో అధికారిక సభ్యుడిగా లేనప్పటికీ ఆయన కనుసన్నల్లోనే అది నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పాకిస్థాన్ విమానయాన రంగాన్ని ఫౌజీ ఫౌండేషన్ సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే పాక్ ఎయిర్ లైన్స్ లోకి సైన్యానికి అధికారిక ప్రవేశం లభించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
2024లో విఫలం కావడానికి కారణం
2024లో జరిగిన వేలంలో పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (PIA)ను దక్కించుకునేందుకు ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ‘బ్లూ వరల్డ్ సిటీ’ అనే రియల్-ఎస్టేట్ కంపెనీ 60% వాటాకు 36 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. ప్రభుత్వం ఆశించిన 305 మిలియన్ డాలర్ల కనీస ధరకు ఇది ఆమడ దూరంలో ఉండటంతో వేలాన్ని రద్దు చేశారు. గత వేలంలో తలెత్తిన మరో సమస్య ఏంటంటే.. కొనుగోలు దారులు పూర్తిగా (100 శాతం) ఎయిర్ లైన్స్ యాజమాన్యాన్ని తమకు అప్పగించాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం కొంత వాటాను మాత్రమే విక్రయిస్తామని చెప్పింది. దీంతో పీఐఏ కొనుగోలుకు ఆసక్తికనబరిచిన చాలా కంపెనీలు చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకున్నాయి.
Also Read: Revenue Officers: గురుకులాల పోస్టింగ్‌కు ఓ సీనియర్ మంత్రి ఆర్డర్.. సంక్షేమ శాఖపై రెవెన్యూ ఆఫీసర్లు కన్ను?
మూతపడే స్థితిలో పాక్ ఎయిర్ లైన్స్..
ఇదిలా ఉంటే పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పీఐఏ.. ఏ క్షణమైన మూతపడే స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీలు చెల్లించని కారణంగా విదేశీ ఎయిర్ పోర్టులు.. పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన కొన్ని విమానాలను స్వాధీనం కూడా చేసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇంధనం, స్పేర్ పార్ట్స్ కొరత కారణంగా పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు.. ఎగరకుండా విమానశ్రయంలోని పార్కింగ్ స్థానాల్లో గత కొంతకాలంగా నిలిచిపోయి ఉన్నాయి. గత సంవత్సరం ఐరోపా యూనియన్ విధించిన నాలుగేళ్ల నిషేధంతో పాక్ ఎయిర్ లైన్స్ మరింత కష్టాల్లోకి జారుకుంది. అయితే ఇటీవల ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో కాస్త ఊపిరిపీల్చుకుంది. డిసెంబర్ 23న జరిగే బిడ్లలో పాక్ ఎయిర్ లైన్స్ ఎంత ధర పలుకుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
