Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే నవ వధువును ఓ భర్త ఇంటి నుంచి గెంటేశాడు. మోటార్ బైక్ లేదా రూ.2 లక్షల నగదును పుట్టింటి వారిని అడగాలని వరుడు సూచించాడు. అందుకు వధువు నిరాకరించడంతో ఇంటి నుంచి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
కాన్పూర్‌లోని జూహి ప్రాంతానికి చెందిన లుబ్నా (Lubna), మహమ్మద్ ఇమ్రాన్ (Mohammad Imran) జంటకు నవంబర్ 29న ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో అత్తింటిలోకి అడుగుపెట్టిన లుబ్నాకు ఊహించని షాక్ తగిలింది. నూతన వధువు ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అదనపు కట్నం కోసం వరుడి కుటుంబం వేధించడం ప్రారంభించింది. బుల్లెట్ బైక్ లేదా రూ.2 లక్షల కట్నం తీసుకోని రావాలని భర్త కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తెచ్చినట్లు లుబ్నా ఆరోపించింది.
‘నా ఆభరణాలు లాక్కున్నారు’
‘నేను ఇంట్లోకి వచ్చిన వెంటనే వాగ్వాదం మొదలైంది. బైక్ లేదా డబ్బు తీసుకొని రావాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. ఒంటిపైన ఉన్న ఆభరణాలు, పుట్టింటి నుంచి తీసుకొచ్చిన కొంత డబ్బును కూడా లాక్కున్నారు. నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు తోసేశారు’ అని లుబ్నా వివరించింది. మరోవైపు వధువు తల్లి మెహతాబ్ మాట్లాడుతూ ‘సాయంత్రం 7:30కి లుబ్నా మా ఇంటి వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చావని అడిగితే ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read: iBomma Ravi: ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికి పోలీసు జాబ్ ఆఫర్.. అతడి రియాక్షన్ ఇదే!
వరుడి ఫ్యామిలీపై కేసు నమోదు
తమ కుమార్తె వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశామని లుబ్నా కుటుంబం చెబుతోంది. అల్లుడు ఇమ్రాన్ కు సోఫా సెట్, టెలివిజన్, వాషింగ్ మెషిన్, డ్రెస్సింగ్ టేబుల్, వాటర్ కూలర్, డిన్నర్ సెట్‌లు, బట్టలు, స్టీల్ సామాన్లు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొంది. పెళ్లికి ముందే బైక్ అడిగి ఉంటే పెళ్లిపై ఏదోక నిర్ణయం తీసుకొని ఉండేవాళ్లమని తల్లి మెహతాబ్ అన్నారు. తమకు సాధ్యమైనంతవరకూ కూతురు పెళ్లి కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. మరోవైపు లుబ్నా ఫ్యామిలీ ఫిర్యాదుతో ఇమ్రాన్ కుటుంబంపై కేసు నమోదు అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
