Kavitha On Pawan: కోనసీమకు దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. పక్కోడు చెడిపోవాలని తెలంగాణ బిడ్డలు ఎప్పుడూ కోరుకోలేదని పేర్కొన్నారు.
‘ఆంధ్రా బాగునే కోరుకున్నాం’
హైదరాబాద్ ఎల్బీనగర్ లో కవిత మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తొలి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని ఆరోపించారు. ‘తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో.. ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం’ అని కవిత అన్నారు.
‘పక్కోడు చెడిపోవాలని అనుకోం’
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు వేదికగా గతంలో తాను మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ‘పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలనే కోరుకుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం. అలా అనుకొని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప.. ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు. ఆనాడు మీరు సినిమా నటుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏపీ డిప్యూటీ సీఎం. మీ మాటలను ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి’ అని కవిత సూచించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మరోవైపు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిధ్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పడం లేదు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా?. నీవు క్షమాపణ చెప్పేంతవరకు జడ్చర్ల నియోజకవర్గంలో నీ సినిమా మాత్రం ఆడనిచ్చేది లేదు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించాల్సిందే. తెలంగాణ ప్రజలను నర దిష్టి అంటూ రాక్షసులతో పోల్చడం కరెక్ట్ కాదు. నేను పవన్ ఫ్యాన్ అయినా తెలంగాణను చులకనగా చూస్తాను అంటే సహించేది లేదు. మిగతా ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ ప్రాంతం విషయంలో వారు కూడా ఒకతాటిపైకి రావాలి’ అని అన్నారు.
Also Read: Warangal Crime: పుట్టింటిలో భార్య.. కత్తితో వెళ్లిన అల్లుడు.. మామ ఏం చేశాడంటే?
జనసేన పార్టీ స్పందన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన పార్టీ మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం దృష్ట్యా పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దు’ అని ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయని చెప్పారు. రాష్ట్రం వీడిపోవడానికి ఇక్కడి పచ్చదనం కూడా ఓ కారణమేనని పేర్కొన్నారు. ‘కోనసీమ ప్రాంతం నిత్యం పచ్చగా ఉంటుందని నాయకులంతా అంటారు. ఇప్పుడు కొబ్బరికి దిష్టి తగిలింది’ అని పవన్ వ్యాఖ్యానించారు.
