KTR: ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రత్యామ్నాయం అని బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఆయన చెన్నైలో జరిగిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ‘ఐజీఎన్ఐటీఐఓఎన్’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో రిబూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించడంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదు
దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ,(RahulGandhi) ఆయన నాయకత్వం మారారన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని, మరో వైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్‌కు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదన్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన, ఇన్నోవేషన్ పైన, పారిశ్రామిక ప్రగతిపైన రాహుల్ గాంధీ భవిష్యత్ గురించి మాట్లాడడం ఏనాడు చూడలేదన్నారు. ఈ అంశాలు రాహుల్‌కి ఒక విజన్ ఉన్నట్లు అనిపించడం లేదన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్‌లోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అవుతుందన్నారు.
బిహార్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికి వేయడం వల్లనే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల వేదిక ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కనీసం లక్ష కోట్ల ప్రాజెక్ట్ వ్యయం లేని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం అయన అజ్ఞానానికి నిదర్శమన్నారు.
Also Read: KTR: తెలంగాణకు మొదట్నుంచీ కాంగ్రెస్ విలన్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు!
హామీలను నెరవెర్చడంలో తీవ్రంగా మోసం
దక్షిణాన భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉందని అనుకోవడం లేదన్నారు. రానున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి బలమైన పాఠం చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చడంలో తీవ్రంగా మోసం చేసిందని, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పదేళ్లలో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లిందని, అయితే, బీజేపీ విభజన రాజకీయాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా మేము విఫలం అయ్యామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వెనుకబడ్డ తెలంగాణ
బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా సాధించిన తెలంగాణ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వెనుకబడడం బాధాకరమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచాకాల నుంచి పార్టీని కాపాడుకోవాల్సి వస్తుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పట్ల నిబద్ధతతో అభివృద్ధి వైపు తీసుకెళ్లామని, అందుకే స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి మొదలుకొని తలసరి సగటు ఆదాయం వరకు అన్ని రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచామన్నారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీది అవకాశవాదమే అని మండిపడ్డారు.
కొత్త సంస్థలను ఏర్పాటు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునాతనమైన టెక్నాలజీలను అందుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్నోవేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అందుకే టీ-వర్క్స్ వంటి అనేక కొత్త సంస్థలను ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగాల పైన స్వల్పకాలమే ఉంటుందని, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కొత్త ఉద్యోగాలు మరిన్ని ఐటీ రంగంలో వస్తాయన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డబుల్ ఇంజిన్’ వంటి నినాదాలతో మాత్రమే ఇది సాధ్యం కాదని, ఆచరణలో కూడా నిబద్ధత చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: KTR: బీఆర్ఎస్ కార్పొరేటర్లకు.. కేటీఆర్ దిశానిర్దేశం!

