Albert Einstein: అల్బర్ట్ ఐన్‌స్టీన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తరాలు మారిన చెరగని పేరు ఈయనది. 1955లో మరణించిన తర్వాత, అతని పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ థామస్ హార్వే అనే పాథాలజిస్ట్ అతని మెదడును శాస్త్రపరంగా పరిశీలించాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఐన్‌స్టీన్ ఎందుకు అంత అధ్బుతమైన మేధస్సు కలవాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల్లో ఎక్కువగా ఉండేది. అందుకే డాక్టర్ హార్వే అతని మెదడును సుమారు 240 చిన్న ముక్కలుగా కట్ చేసి, ప్రపంచంలోని వివిధ న్యూరోసైన్స్ పరిశోధనా కేంద్రాలకు పంపించాడు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మెదడులోని కణాలు, నిర్మాణం, న్యూరాన్‌ల పంపిణీ వంటి విషయాలను మైక్రోస్కోప్‌తో చాలా వివరంగా పరిశీలించవచ్చని భావించారు.
ఈ అధ్యయనాల్లో ఐన్‌స్టీన్ మెదడులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, అతని పారియేటల్ లోబ్స్ సాధారణ మనుషుల కంటే పెద్దగా, విభిన్న రూపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భాగం గణితం, తర్కశక్తి, స్పేస్ అర్థం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే, అతని మెదడులో గ్లియల్ సెల్స్ సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా శాస్త్రవేత్తలు గమనించారు. ఇవి న్యూరాన్‌లకు సపోర్ట్ ఇచ్చే కణాలు. ఈ నిర్మాణ భేదాలే అతని అసాధారణ ప్రతిభకు కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావించారు.
అయితే ఐన్‌స్టీన్ మెదడును తీసుకోవడం, ముక్కలు చేయడం అన్నది తర్వాత పెద్ద వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఆ సమయంలో కుటుంబం నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతని కుటుంబ సభ్యులు ఇది పూర్తిగా శాస్త్ర ప్రయోజనం కోసమేనని అంగీకరించడంతో, ఈ పరిశోధనలు కొనసాగాయి. ఈ విధంగా ఐన్‌స్టీన్ మెదడు 240 ముక్కలుగా కట్ చేసిన కథ శాస్త్ర చరిత్రలో ఒక ఆసక్తికరమైన అధ్యాయంగా మారింది.
