Panchayat Elections: సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అయితే, ఇటీవల కాలంలో ఈ పోటీ అడ్డగోలు ఖర్చులకు దారి తీయడంతో, ప్రజలతో సంబంధం లేని వ్యక్తులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పలు గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పోటీ పడి డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలు కావడం కంటే, ఏకగ్రీవాల ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాలు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గ్రామంలోని కుల సంఘాల పెద్దలందరూ కలిసికట్టుగా ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం జిల్లాలో శుభపరిణామంగా మారింది. ఈ ప్రక్రియలో పార్టీలకు అతీతంగా పాలకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం.
తండాలు, గూడెంలలో ఏకగ్రీవాలు
ముఖ్యంగా అతి తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీల్లో, తండాలు, గూడెంలలో ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఫారూక్‌నగర్ మండలం చింతగూడ, కేశంపేట్ మండలం దేవునిబండ తండాలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు కూడా ఏకగ్రీవంగా తమ పాలకవర్గాన్ని ఎన్నుకున్నాయి. వాటిలో యాలాల్ మండలం లక్ష్మీ నారాయణ పూర్, తాండూరు మండలం చిట్టి ఘనపూర్, బొమ్మరాస్‌పేట్ మండలంలో సాలిండాపూర్, మదనపల్లి తండా, జానకంపల్లి, నాగిరెడ్డిపల్లి, కట్టు కాల్వ తాండ, టేకుల గడ్డ తాండ, దుద్యాల మండలంలో సంగయ్యపల్లి గ్రామాలు ఉన్నాయి.
Also Read: Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలపై పార్టీల దృష్టి.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు!
ఖర్చులేకుండా
అనేక గ్రామాల్లో కేవలం సర్పంచ్ పదవిని మాత్రమే కాకుండా, వార్డులన్నింటినీ కలిపి ఏకగ్రీవం చేసుకోవడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. అడ్డగోలుగా ఖర్చులు పెట్టి అప్పుల పాలవడం కంటే, గ్రామస్తులందరితో కలిసి ఏకగ్రీవాలకు మద్దతు ఇస్తే అందరికీ గౌరవంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఏకగ్రీవాల ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీల జోక్యం లేకుండానే కొనసాగడం విశేషం. మొదటి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. ఈ విడుతలో పోటీ చేసే అభ్యర్థులకు డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సమయం ఉంది. ఈ గడువులోగా మరిన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Also Read: TG Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మూడు విడతల్లో పోలింగ్
