MP Laxman: ఓట్ల కోసం బీసీల కాళ్లు మొక్కడం.. గద్దెనెక్కినంక గొంతు కోసుడు కాంగ్రెస్ నైజమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) పేరుతో నమ్మించి మోసం చేశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామని చెప్పి ఇప్పుడు పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. రేవంత్ రెడ్డివి అన్నీ 420 హామీలేననీ.. ఆయన కార్చేవి మొసలి కన్నీళ్లేనని చెప్పారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో పూలే చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
136 కులాలకు న్యాయం
అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ… తెలంగాణలో బీసీ(BC)లకు దశాబ్ద కాలంగాఅన్యాయం జరుగుతూనే ఉందని, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలని చెప్పి జనాలను ముంచారని, బీసీ డిక్లరేషన్ అటకెక్కించారని ఆరోపించారు. సబ్ ప్లాన్ కు చట్టబద్ధత లేదనీ,.. 136 కులాలకు న్యాయం లేదని చెప్పారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని చెప్పారు. తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అశాస్త్రీయ సర్వేలతో బీసీలను ఆగమాగం చేసిందని విమర్శించారు.
Also Read: Imran Khan’s Son: ఇమ్రాన్ ఖాన్ మృతిపై వదంతులు.. పాక్ ప్రభుత్వానికి కుమారుడు స్ట్రాంగ్ వార్నింగ్!
అశాస్త్రీయ డేటాతో..
“డెడికేషన్ కమిషన్ కు కోరలు లేవు.. ప్లానింగ్ శాఖ సర్వే అసంబద్ధం. తూతూ మంత్రంగా సర్వేలు చేసి, అశాస్త్రీయ డేటాతో కోర్టులకు వెళ్లి అభాసుపాలయ్యారు..”అని ఆరోపించారు. నెహ్రూ హయాం నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చిందని లక్ష్మణ్ గుర్తుచేశారు. 2026లో కులగణనతో కూడిన జనగణన చేపడుతున్న ప్రధాని మోదీనే అభినవ పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, చంద్రశేఖర్ తివారి, వేముల అశోక్, ఆనంద్ గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

