VC Sajjanar: కట్టుదాటితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ రౌడీషీటర్లను హెచ్చరించారు. నేరాల జోలికి వెళ్లకుండా జీవనం గడపాలని చెప్పారు. మీ అందరిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి తెల్లవారుఝాము 3గంటల వరకు సౌత్ వెస్ట్ జోన్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఎలాంటి సైరన్లు మోగించకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఆయన క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పెట్రోలింగ్ సిబ్బందితోపాటు గస్తీ విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మహ్మదీయ లైన్స్, ఆశంనగర్, డిఫెన్స్ కాలనీల్లో ఉంటున్న పలువురు రౌడీషీటర్ల ఇండ్లకు వెళ్లారు.
Also Read: VC Sajjanar: సైబర్ మోసాలకు చెక్ పెట్టేది ప్రజల అవగాహన మాత్రమే : హైదరాబాద్ సీపీ సజ్జనార్
నేరాలకు పాల్పడ్డారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
గతంలో ఏయే నేరాలకు పాల్పడ్డారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరాలకు దూరంగా ఉండాలని రౌడీషీటర్లతో చెప్పారు. అలా కాదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, తెరిచి ఉన్న షాపుల వద్దకు వెళ్లి పరిశీలించారు. అర్ధరాత్రి దాటినా వ్యాపారాలు చేస్తున్న వారిని ఇక ముందు అలా చేయవద్దని హెచ్చరించారు. లంగర్ హౌస్, టోలీచౌకీ పోలీస్ స్టేషన్లను సందర్శించి స్టేషన్ జనరల్ డైరీ, నైట్ ఎంట్రీలు, డ్యూటీ రోస్టర్లు, అటెండెన్స్ రికార్డులను పరిశీలించారు. వెల్ఫేర్ పోలీసింగ్ లో భాగంగానే ఈ ఆకస్మిక తనిఖీలు జరిపినట్టు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. శాంతిభద్రతలను కాపాడటం దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీసు సిబ్బంది అందరూ విజబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

