KL Rahul: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టుని బీసీసీఐ(BCCI) ఆదివారం ప్రకటించింది. భారత రెగ్యులర్ వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు, రెగ్యులర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా ఆస్ట్రేలియాలో శస్త్రచికిత్స చేయించుకుని, చికిత్స పొందుతున్నందున అతడు కూడా అందుబాటులో లేడు. దీంతో, తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా..
రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నా, అతడు ఏడాదికి పైగా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడకపోవడంతో కేఎల్ రాహుల్ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. జట్టు విషయానికి వస్తే, భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా జట్టులో చోటుదక్కింది. గిల్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో, ఇండియా-ఎ తరఫున ఆడుతూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా సెలక్ట్ చేశారు. జట్టు ఎంపికలో మరో విశేషం ఏంటంటే, ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో చోటుదక్కని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన సీనియర్ పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతిని ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నారు. ఇక, సీనియర్ పేసర్ మహ్మద్ షమీని మరోసారి సెలక్టర్లు విస్మరించారు. స్పిన్ విభాగం విషయానికి వస్తే, వరుణ్ చక్రవర్తిని సెలక్టర్లు పక్కనపెట్టారు. జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురూ స్పిన్ కోటాలో జట్టులో ఉంటారు.
భారత వన్డే జట్టు ఇదే!
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
Also Read: Salary Delay: ఉర్దూ అకాడమీలో ఉద్యోగుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

