Maloth Kavitha: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆలోచనలు, ఆశయాలు ఆచరణీయం, అనుసరణీయమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత(Malothu Kavitha) పేర్కొన్నారు. ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి సందర్భంగా నెహ్రూ సెంటర్లో సత్యసాయి సేవా సమితి మహబూబాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మాజీ ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… ప్రజల్లో సేవా భావం విస్తృతం చేయడానికి శ్రీ సత్య సాయి సేవా సమితి మహబూబాబాద్ ఎప్పటికీ ప్రశంసనీయమని కొనియాడారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
ప్రభుత్వాలు కూడా చేయలేని..
సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు. సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా, వారి ట్రస్టు ద్వారా సేవలందించి చూపించారన్నారు. విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో సత్యసాయి సేవా ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుందన్నారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారు. మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారన్నారు. ఈనాడు 189 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారన్నారు.
ప్రశాంతి పతాకావిష్కరణ
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి శ్రీ సత్య సాయి సేవా సమితి మహబూబాబాద్(Mahabubabad) అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వహించిన కార్యక్రమాలు ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర సంకీర్తన శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద నుండి ప్రారంభించారు. ఉదయం 7:30 గంటలకు ప్రశాంతి పతాకావిష్కరణ చేశారు. ఎనిమిది గంటలకు శ్రీ సత్య సాయి సింహాసనం ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఎనిమిదిన్నర గంటలకు మంగళ హారతి నిర్వహించారు. 10 గంటలకు స్థానిక నెహ్రూ సెంటర్లో వేద పట్టణం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 గంటలకు శ్రీ సత్యసాయి ఉపాధి పథకం ద్వారా అర్హులైన వారికి కుట్టుమిషన్లు, గ్రైండర్లు పంపిణీ చేశారు. 12:30 గంటలకు అన్నప్రసాదర వితరణ కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర ఎస్ ఎస్ వి ఎల్ ఫంక్షన్ హాల్ నుండి శ్రీ సాయిబాబా మందిరం వరకు నిర్వహించారు.
