Local Body Elections: రాష్ట్రంలో ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు గ్రామీణ పట్టు కోసం సీరియస్ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో జరగబోయే సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా గ్రామాల్లో గెలుపు గుర్రాలను గుర్తించేందుకు ‘స్థానిక సర్వే’ ను మొదలు పెట్టింది. కేవలం పార్టీ జెండా మోసేవారినే కాకుండా, ప్రజల్లో సానుకూలత ఉన్న వ్యక్తులు, స్థానికంగా ప్రభావితం చేయగలిగే నాయకులపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది.
పార్టీ లైన్‌ను దగ్గరగా ఉండేలా కాంగ్రెస్ ప్లాన్
దీని వలన గెలుపు గుర్రాలను స్పష్టంగా గుర్తించి, ఇప్పటినుంచే పార్టీ లైన్‌ను దగ్గరగా ఉండేలా కాంగ్రెస్ ప్లాన్ చేయనున్నది. గతంలో మాదిరిగా సిఫార్సులకే పరిమితం కాకుండా, ఈసారి కచ్చితంగా గెలిచే అభ్యర్థులనే బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది. పార్టీ సింబల్ లేకపోయినా.. కాంగ్రెస్ ఫేవర్ క్యాండియేట్లుగా పోటీలో నిలవనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ ‘పాజిటివ్’ ఇమేజ్ ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నది. ప్రజలతో మమేకమయ్యే వారు, వివాదాలకు దూరంగా ఉండేవారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్నవారి కోసం ఈ సర్వే జరుగుతున్నది. పార్టీలోని సీనియర్ల కంటే, ప్రజల్లో ఆదరణ ఉన్న కొత్త ముఖాలకైనా సరే టికెట్ ఇచ్చేందుకు వెనుకాడకూడదని పార్టీ భావించడం గమనార్హం.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలకు భద్రతపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదన ఇదే
‘లోకల్’ వ్యక్తులపై లోతైన అధ్యయనం..
పార్టీ సభ్యత్వం లేకపోయినా.. గ్రామంలో మంచి పేరున్న వ్యక్తులు, సామాజిక సేవలో ముందున్న వారిని గుర్తించే పనిలో సర్వే బృందాలు నిమగ్నమయ్యాయి. వృత్తి రీత్యా టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన సంఘాల నాయకులు ఎవరైతే స్థానికంగా ప్రజల మద్దతు కూడగట్టగలరో వారి వివరాలు సేకరిస్తున్నారు. కుల సమీకరణాలు, సామాజిక వర్గాల వారీగా పట్టున్న ‘లోకల్ లీడర్ల’ను పార్టీలోకి ఆహ్వానించే యోచనలో కూడా టీపీసీసీ ఉన్నట్లు సమాచారం. ఇక గ్రామాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే, ప్రభావితం చేయగలిగే వ్యక్తులపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక సామాజిక వర్గాన్ని, ఒక వాడను మొత్తంగా తమ వైపు తిప్పుకోగలిగే నాయకులను గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగించడం లేదా ఎన్నికల బరిలో నిలపడంపై చర్చిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నాయకులను కూడా ఈ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు.
టీపీసీసీ వ్యూహం ఇదే..
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించి, గ్రామీణ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సర్వే సాగుతోంది. ఈ సర్వే నివేదికల ఆధారంగానే మండల, జిల్లా స్థాయి కమిటీలు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయనున్నాయి. మొత్తానికి ‘సర్పంచ్’ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఫేవర్‌గా ఉండే అభ్యర్ధులు బలంగా ఉండే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సులువుగా గెలవచ్చని పార్టీ భావిస్తున్నది. ఇక ఏకగ్రీవం చేసేందుకు కూడా పార్టీ ప్రయత్నిస్తున్నది. ఏకగ్రీవమైన పంచాయితీలకు ప్రభుత్వం పది లక్షల ఆఫర్ కూడా చేస్తున్నది.
