Local Body Elections: రిజర్వేషన్లపై కోర్టు కేసులతో పంచాయతీ ఎన్నికల కసరత్తు వాయిదా పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం ఉండడంతో ఆ ఎన్నికలపై దృష్టి సారించలేదు. అయితే, జూబ్లీహిల్స్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా ఒక వైపు, కోర్టులో కేసులు సైతం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలు నిర్వహిస్తేనే గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావుతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజనతో కీలక భేటీ జరిగింది.
Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు.. నోటిఫికేషన్ డేట్ ఫిక్స్!
రూ.4 వేల కోట్లకు పైగా నిధులు
బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై సీఎస్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇవ్వాల్సిన 15వ ఫైనాన్స్ నిధులపైనా చర్చించినట్లు సమాచారం. కేంద్రం నుంచి సుమారు రూ.4 వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నదని ఇవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని, మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని పంచాయతీ రాజ్ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నెల 15న కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలు సిద్ధం చేసి నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్ అధికారులను సీఎస్ ఆదేశించినట్లు సమాచారం.
24న హైకోర్టులో స్థానిక ఎన్నికల కేసు విచారణ
దీనికితోడు ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల కేసు విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు ఎన్నికలపై ప్రభుత్వం తరఫున అందించాల్సిన రిపోర్టుపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీల్లో ఇబ్బందులు, కేంద్ర నుంచి రావాల్సిన ఫండ్స్ వివరాలు, ఎన్నికలు ఆలస్యం అవుతున్న కొద్దీ గ్రామాల్లో తలెత్తే సమస్యలు, తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు సైతం పూర్తి వివరాలతో కూడిన నివేదిక తయారీ పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుస్తామనే ధీమా ఉండడంతో ఈ విజయంతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. మొత్తం అటు కోర్టును, ఇటు బీసీలను సంతృప్తి పరచాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సై.. బీ ఫామ్ ల కోసం ఆశావహులు ప్రయత్నాలు
