Soil Mafia: మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరి పోతున్నాయని, రాత్రివేళల్లో యథేచ్ఛగా మట్టి దందా (Soil Mafia) కొనసాగుతుందని స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కాగానే అధిక లోడుతో టిప్పర్లలో విపరీతమైన వేగంతో మట్టిని తరలిస్తున్నా, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కుంగిపోతున్న రోడ్లు
మట్టిని ఇష్టానుసారంగా తవ్వేయడం వల్ల పొలాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని, దీనివల్ల రైతుల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. మట్టి తవ్విన గుంతల్లో వర్షాకాలంలో నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రాణ నష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారేమో అని పలువురు హేళన చేస్తున్నారు. మట్టి మాఫియా నిర్వహించే మట్టి దందాతో గ్రామాల్లోని రోడ్లు, పంట పొలాలకు వెళ్లే దారులు అధిక బరువుతో టిప్పర్లు వెళ్లడం వల్ల కుంగిపోతున్నాయని, దీంతో రైతులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Soil Mafia: మట్టి మాఫియా దందా.. పట్టించుకోని అధికారులు
పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ భూములు, రైతుల భూములు, చెరువులు అనే తేడా లేకుండా మట్టి మాఫియా రెచ్చిపోయి మరీ దందాను కొనసాగిస్తుండగా, అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు విమర్శిస్తున్నారు. అక్రమ మట్టి దందాపై స్థానికులు, రైతులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా తూతూ మంత్రంగా మాటలు చెప్పి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపిస్తున్నారు. పలు పత్రికల్లో ఈ అంశంపై వార్తలు వచ్చినా మట్టి మాఫియా ఏ మాత్రం భయపడకపోవడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
అక్రమ మట్టి తరలింపు తమ దృష్టికి రాలేదు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతేకాక, ప్రభుత్వ ఆదాయానికి భంగం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని, కఠినంగా వ్యవహరిస్తాం.
– భూపాల్, మేడ్చల్ తహసీల్దార్
Also Read: Minister Raja Narasimha: కిడ్నీ పేషెంట్లకు శుభవార్త.. ప్రతి 25 కిలోమీటర్లకు ఓ డయాలసిస్ సెంటర్!

