New Labour Codes: కార్మికులకు రక్షగా అమల్లోకి 4 కార్మిక చట్టాలు
Labour-Laws (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

New Labour Codes: అమల్లోకి వచ్చిన 4 కార్మిక చట్టాలు.. ప్రతి ఒక్క కార్మికుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

New Labour Codes: దశాబ్దాల నాటి పాత చట్టాలను ఆధునీకరించి, అవసరమైన మార్పులతో రూపొందించిన నాలుగు కార్మిక చట్టాలు శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 40 కోట్ల మంది కార్మికులకు మంచి చేస్తాయని భావిస్తున్న ఆ చట్టాల వివరాలపై అవగాహనం పొందడం ప్రయోజనకరం. మరి, ఆ చట్టాలు ఏమిటి?, కలిగే ప్రయోజనాలు ఏమిటో మీరు కూడా తెలుసుకోండి. నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన ఆ చట్టాల పేర్లు, 1. వేతనాల కోడ్, 2019 (The Code on Wages, 2019), పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 (The Industrial Relations Code, 2020), సామాజిక భద్రత కోడ్, 2020 (The Code on Social Security, 2020), వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020 (The Occupational Safety, Health and Working Conditions Code, 2020). దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు నుంచి, 1950వ దశకంలో రూపొందించిన చట్టాలను ఆధునీకరించడం కేంద్రం లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అవసరమని భావించి ఈ చట్టాలు రూపొందించినట్టు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ చట్టాలు అమల్లోకి రావడంతో కార్మికులకు కనీస వేతనం, గ్రాట్యుటీ, సామాజిక భద్రతల విషయంలో భరోసా లభిస్తుంది.

కొత్త చట్టాల ప్రయోజనాలివే

ఏ రంగంలో పనిచేస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల కార్మికులకు సకాలంలో కనీస వేతనానికి ఈ చట్టాలు హామీ ఇస్తాయి. యువత ఏదైనా ఉద్యోగం చేరితే యాజమాన్య కంపెనీలు తప్పనిసరిగా నియామక పత్రాల (Appointment Letters) ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలకు పురుషులతో సమాన వేతనం ఇవ్వాలి. అంతేకాదు, పని ఏదైనా పురుషులతో సమానంగా మహిళలకు గౌరవానికి ఈ చట్టాలు భరోసా కల్పిస్తాయి. నిర్ణీత కాలానికి నియమించుకున్న ఉద్యోగులకు (Fixed-Term Employees) ఒక ఏడాది ఉద్యోగం తర్వాత యాజమాన్యాలు గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, 40 సంవత్సరాలు పైబడిన కార్మికులకు కంపెనీలు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్ చేయించాల్సి ఉంటుంది. ఇక, ఎవరైనా ఉద్యోగి ఓటీ (ఓవర్‌టైమ్) చేస్తే రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రమాదం పొంచివుండే రంగాలలో పనిచేసే కార్మికులకు 100 శాతం హెల్త్ ప్రొటెక్షన్‌కు ఈ చట్టాలు హామీ ఇస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం దక్కుతుంది. ఇదే విషయాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్త కార్మిక చట్టాల కోడ్‌లు దేశంలోని కార్మిక వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారుతున్నాయని పేర్కొంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను క్రమబద్ధీకరించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా, సుమారుగా 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రతకు ఈ చట్టాలు హామీ కల్పిస్తాయి.

Read Also- Komatireddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌లో ఏఐసీసీ ట్విస్ట్.. మంత్రి పదవి పై తర్జన భర్జన

ఉపాధికి అధికారిక రూపం

అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాల్లో పలు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఉపాధి, ఉద్యోగాలకు ఈ చట్టాలు అధికారిక రూపం ఇస్తాయి. అంటే, కార్మికులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు అందించాల్సి ఉంటుంది. లిఖితపూర్వకంగా పారదర్శకత, ఉద్యోగ భద్రత, స్థిరమైన ఉపాధికి ఈ చట్టాలు రక్షణ కల్పిస్తాయి. ఏ రంగంలో పనిచేసినా సరే, ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కవరేజీ లభిస్తుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ఇందుకు హామీ ఇస్తుంది. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి సామాజిక భద్రత కవరేజీ ఉంటుంది. కార్మికులందరికీ పీఎఫ్ (PF), ఈఎస్‌ఐసీ (ESIC), బీమా, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు వర్తిస్తాయి.

కనీస వేతన చట్టం విషయానికి వస్తే, వేతనాల కోడ్, 2019 ప్రకారం, కార్మికులందరికీ కనీస వేతనాన్ని పొందే హక్కు చట్టబద్ధంగా ఉంటుంది. ఆ కనీస వేతనాన్ని కూడా సకాలంలో చెల్లించేలా భద్రత కల్పిస్తుంది. 40 సంవత్సరాలు పైబడినవారికి ప్రతిఏటా హెల్త్ చెకప్ చేయించాల్సి ఉండడంతో, కార్మికుల ఆరోగ్య సంరక్షణకు కొత్త చట్టాలు దోహదపడతాయి. సకాలంలో వేతనాలు చెల్లించాలనే నిబంధనలు, కార్మికుల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయి. కార్మికుల మనోధైర్యాన్ని కూడా పెంచుతాయి.

Read Also- MLA Kadiyam Srihari: ఆ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై సర్వత్రా ఉత్కంఠ.. ఉప ఎన్నిక ఖాయమా..?

కార్మికులుగా ఉపాధి పొందుతున్న మహిళల భద్రత అవసరమైన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల సంస్థలు, లేదా కంపెనీలలో రాత్రిపూట, అన్ని పనులలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఎక్కువ శాలరీలు పొందే ఉద్యోగాల్లో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇకపై, ఒక్క ఉద్యోగి ఉన్న కంపెనీ కూడా ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాల్సిందే.

వివిధ రంగాలలో కార్మికుల భద్రతను ఎప్పటికప్పుడు తనికీ చేయడానికి నేషనల్ ఓఎస్‌హెచ్ (Occupational Safety and Health)) బోర్డు ఏర్పాటు అవుతుంది. వివిధ రంగాలలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలను సమన్వయం చేయడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. ఇక, 500 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న కంపెనీలు, సంస్థలలో సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అవుతుంది. తద్వారా కంపెనీ జవాబుదారీతనం మెరుగవుతుంది. ఈ నిబంధనలు చిన్న కంపెనీలపై నియంత్రణ భారాన్ని తగ్గించి, కార్మికుల భద్రతకు మేలు చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీస్, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్లు, మహిళా కార్మికులు, యువ కార్మికులు, ఎంఎస్ఎంఈ వర్కర్స్, బీడీ-సిగరెడ్ వర్కర్లు, ప్లాంటేషన్ వర్కర్లు, ఆడియో-విజువల్ అండ్ డిజిటల్ వర్కర్స్, మైనింగ్ వర్కర్స్, ఇలా దాదాపు అన్ని రంగాల్లో పనిచేసే వర్కర్లకు ఈ చట్టాలు ప్రయోజనం చేకూర్చుతాయి.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు