Harish Rao: సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. మృతదేహాల సాక్షిగా ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం శోచనీయమని మండిపడ్డారు. జూన్ 30న సీఎం స్వయంగా వచ్చి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
Also Read: Harish Rao: రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్
కానీ, వాస్తవానికి బాధితుల చేతికి అందింది కేవలం రూ.26 లక్షలేనని, ఒక్కో కుటుంబానికి ఇంకా రూ.74 లక్షలు బాకీ పడ్డారని, ఇది మాట తప్పడం కాదా? అని ఆయన నిలదీశారు. ప్రమాదంలో ఆచూకీ దొరకని 8 మంది కార్మికులకు డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని హరీశ్ ఆరోపించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సిట్ వేయకుండా, అరెస్టులు చేయకుండా నిస్సిగ్గుగా యాజమాన్యాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆరోపించారు. పరిహారం కోసం బాధితులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా, అధికారుల విసుగులు, చీదరింపులు ఎదురవుతున్నాయని, యాజమాన్యానికి అధికారులు ఏజెంట్లుగా మారారని ధ్వజమెత్తారు. తక్షణమే కోటి పరిహారం చెల్లించాలని, లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హరీశ్ హెచ్చరించారు.
ఇది కక్ష సాధింపే.. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఎక్స్ వేదికగా గురువారం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని అన్నారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కార్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ దుర్మార్గ వైఖరి
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామికం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.
విద్యా రంగానికి అందించిన సేవలు వెలకట్టలేనివి
మరోవైపు, విద్యా రంగానికి చుక్కా రామయ్య అందించిన సేవలు వెలకట్టలేనివి అని హరీశ్ రావు అన్నారు. చుక్కా రామయ్య వందవ పుట్టిన రోజు సందర్భంగా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్

