Harish Rao On CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ఆయనొక బ్లాక్ మెయిలర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించి తగిన బుద్ది చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నిక (Jubliee Hills Bypoll) 4 లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదన్న హరీశ్ రావు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ తీర్పు కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.
‘సీఎంకు ఓటమి భయం’
రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. దీనికి తోడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress)కు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని బెదిరింపులు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న హరీశ్.. ఈ బ్లాక్ మెయిలర్ ను ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతును జూబ్లీహిల్స్ లో గెలిపించాలని అన్నారు.
క్రైమ్‌లో పురోగమనం
రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు తిరోగమనం పడితే ఒక్క క్రైమ్ మాత్రం పురోగమనం అయ్యిందని హరీశ్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) అగ్రికల్చర్ పెంచితే.. రేవంత్ గన్ కల్చర్ పెంచారని మండిపడ్డారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమవుతుందని అన్నారు. మొత్తం 189 మర్డర్లు జరిగితే.. అందులో 88 నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగినవేనని అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 % పెరిగిందని చెప్పారు. కేసీఆర్ కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ హబ్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఇన్‌సెక్యూరిటీ హబ్ గా మారిపోయిందని ధ్వజమెత్తారు.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. వి. కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్
‘రెండేళ్లలో ఏం చేశారు’
జూబ్లీహిల్స్ లో రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఇటీవల కేటీఆర్ (KTR) నివేదిక సైతం విడుదల చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. మరి రెండేళ్ల పాలనలో మీరు ఏం చేశారో సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ (BJP) పార్టీలు రెండూ కలిసి పని చేస్తున్నాయని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. కాంగ్రెస్ పుట్టక ముందు నుంచే ముస్లింలు ఉన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ముస్లింలను అవమానించినందుకు సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నే గెలుస్తుందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
