Gadwal Town Fraud: ఎలాంటి ఆధారాలు లేని ఒక వ్యక్తి.. ఓ క్యాంటీన్ లో వంట మాష్టారుగా చేరి రూ.60 లక్షలు దోచేసిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. రూ.110 ఉన్న కిలో పామాయిల్ రూ.70కి, రూ.65 ఉన్న కిలో బెల్లం రూ.35 ఇచ్చి.. తనను తాను వ్యాపారిగా నిందితుడు పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు రూ.లక్ష ఇస్తే రూ.1000-5000 వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. అధిక వడ్డీకి ఆశపడిన గద్వాల్ వాసులు.. రూ.లక్షల్లో నగదును అతడి చేతిలో పెట్టారు. తీరా అతడు జంప్ కావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే..
జనాల నుంచి లక్షల్లో దోచేసి రాత్రికి రాత్రి ఓ వ్యక్తి పారిపోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల ఆర్టీసి బస్టాండ్ లో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన చంద్ర అనే వ్యక్తి గద్వాల ఆర్టీసి బస్టాండ్ లో గల ఎస్ఎల్ఎన్ క్యాంటీన్ లో వంటమాస్టారు గా చేరారు. వంట మాస్టారుగానే ఉంటూ హోటల్ కు వస్తున్న ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్ లు, వినియోగదారులతో పరిచయం పెంచుకున్నాడు.
వ్యాపారులతోనూ పరిచయం
అదే విధంగా గద్వాల ఆర్టీసి బస్టాండ్ చుట్టు పక్కల ఉన్న కిరాణా స్టోర్స్, హోటల్స్ నిర్వాహకులకు పరిచయమయ్యాడు. ఆర్డర్ లపై తక్కువ ధరకే పామాయిల్ నూనె, అల్లం, బెల్లం, తెప్పించి సరఫరా చేసేవాడు. ఇదే క్రమంలో కొందరితో అధిక వడ్డీ ఆశ చూపి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇలా అనేక మంది నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read: Nara Bhuvaneshwari: మమ్మల్ని చంపుతారట.. ఫ్యామిలీకి ముప్పు ఉంది.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
అవాక్కైన పోలీసులు
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. క్యాంటీన్ లో పనిచేస్తున్న వ్యక్తి గురించి ఆరా తీయడం ప్రారంభించారు. అయితే క్యాంటీన్ నిర్వాహకుల వద్ద ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. ఆధార్, ఓటర్, పాన్ ఇలా ఏ గుర్తింపు కార్డు అడగకుండానే నిందితుడ్ని క్యాంటీన్ నిర్వాహకులు ఉద్యోగంలోకి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి కనీనం ఫోన్ నెంబర్ గానీ, ఫొటోలు గానీ క్యాంటీన్ వారితో పంచుకోకపోవడం గమనార్హం. తనది ఆళ్లగడ్డ అని, పేరు చంద్ర అని అతడి ఇచ్చిన సమాచారం కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిందితుడు పక్కా ప్లాన్ తోనే ఈ దోపిడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కనిపించకుండా పోయిన అతడి గురించి ముమ్మరంగా గాలిస్తున్నారు.
