Seethakka: మహిళా సాధికారతకు నూతన దిశానిర్దేశం చేసే చారిత్రక ఘట్టంగా ఉమెన్ రౌండ్ టేబుల్ సమావేశం నిలిచిపోతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో మహిళల ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం, భద్రత, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై చర్చించారు.
మహిళల ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సమాజపు పోకడల కారణంగా అవి ప్రాక్టికల్‌గా అమలుకావడంలో సమస్యలు వస్తున్నాయని వివరించారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా తొలగించేందుకు నిపుణులు, మేధావులు, అధికారులు ఇచ్చే సూచనలు అత్యంత ఉపయోగకరమవుతాయన్నారు. ఈ చర్చ రాజకీయ కార్యక్రమం కాదని, మహిళల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం అని ఆమె స్పష్టం చేశారు.
Also Read: Seethakka: మహిళా సంక్షేమంపై నెదర్లాండ్‌లో అధ్యయనం.. విదేశీ పర్యటనలో మంత్రి సీతక్క
నూతన మహిళా విధానం రూపకల్పన
విద్య, ఉపాధి, ఉద్యోగాలు, భద్రత వంటి రంగాల్లో మహిళలకు ఎలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకుని, సమగ్ర నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా త్వరలో విస్తృత స్థాయి సదస్సును ఏర్పాటు చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8 నాటికి ఒక కొత్త మహిళా విధానాన్ని రూపకల్పన చేస్తామని వెల్లడించారు. మహిళలు ‘నా ఆరోగ్యం నా బాధ్యత’ అనే భావనతో ముందుకు రావాలని, వారికి తగిన ఆరోగ్య అవగాహన కల్పించే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందుకోసం నిపుణులతో సబ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, ప్రత్యేక సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, పరిష్కార మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తామన్నారు. రేపటి తరం కోసం నేటి మేధోమదనం ఎంతో అవసరమని, తెలంగాణను మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ సహా పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

