BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై తీవ్ర గందరగోళం నెలకొన్నది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లకు పార్టీ సింబల్స్ ఉండవు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు పార్టీ గుర్తుల (Symbols) లేకుండానే పోటీలో నిలుస్తారు. ఆయా అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేస్తారు. ఎన్నికల కమిషన్(Election Commission) కేటాయించిన సాధారణ గుర్తులపైనే ఎన్నికలకు వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు ఎలా సాధ్యమనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఎస్సీ(SC), ఎస్టీ(ST)లకు జనాభా దామాషా ప్రకారం, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా కేటాయిస్తారు. బీసీలకు కూడా ఇదే తరహాలో అమలు చేస్తామని సర్కార్ గతంలో హామీ ఇచ్చింది. కానీ, కోర్టు కేసుల నేపథ్యంలో పార్టీ పరంగా ఇస్తామని సాక్షాత్తు సచివాలయం సాక్షిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కానీ, సర్పంచ్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీలోనూ స్పష్టత లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోని బీసీ లీడర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఇంత కాలం తమకు రిజర్వేషన్లు వర్తిస్తాయని, పోటీ చేయొచ్చని ఆశతో ఎదురుచూస్తున్న నేతలు కాస్త షాక్‌లో ఉండటం గమనార్హం. ఈ చిక్కుముడిని తొలగించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్లు సాధించేందుకు ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఓ సీనియర్ బీసీ నేత కోరారు.
రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన ప్లాన్.. కానీ బ్రేక్?
ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ అమలుపై హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రకటించారు. ఆ తర్వాత దీని అమలు కోసం డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు కులగణన సర్వే నిర్వహించి జనాభా సంఖ్యను కులాల వారీగా సేకరించారు. ఆ తర్వాత బీసీల సంఖ్య పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగాల బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. దీంతో పాటు 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని సీలింగ్‌ను తొలగిస్తూ గవర్నర్‌కు పంపారు. అక్కడి నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో జీవో తీసుకొచ్చారు. ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీం కోర్టులో రిజర్వేషన్ల అంశంపై విచారణ కొనసాగుతుంది. సర్పంచ్‌లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. దీంతో చివరికి పార్టీ పరంగా వెళ్లాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని ప్రకటించారు. అయితే వీటి అమలుపై బీసీ నేతల్లో టెన్షన్‌తో పాటు అనుమానం నెలకొన్నది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు పార్టీలకు ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నాయి.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్ తప్పు చేశారు.. కుట్ర చేసి నన్ను పంపేశారు.. కవిత సంచలన కామెంట్స్
పార్టీలో టెన్షన్..?
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశంతో క్షేత్రస్థాయి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావించింది. దీనికి అనుగుణంగానే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్ని జిల్లాల నాయకులకు తన ప్రణాళికను షేర్ చేశారు. బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నందున, దీన్నే ఎన్నికల ప్రధాన ఏజెండాగా తీసుకొని గతంలో గాంధీభవన్‌లో ముఖ్య నాయకుల మీటింగ్‌లో సూచించారు. కానీ, ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో పార్టీ పరంగానే 42 శాతంతో వెళ్లేందుకు సర్కార్ మొగ్గు చూపడంతో పార్టీలోని గ్రౌండ్ లీడర్లు ఎలా స్పందిస్తారోనని గాంధీభవన్ వర్గాల్లోనూ టెన్షన్ నెలకొన్నది. అంతేగాక కోర్టు తీర్పు అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవన్నీ బీసీ నేతల గందరగోళానికి కారణమవుతున్నాయి. ఈ గందరగోళంలో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు పీసీసీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలైతే.. ప్రస్తుత బీసీ పదవులకు మరో 23 వేలకు పైగా అదనంగా చేరనున్నాయి.
సుప్రీం కోర్టులో ఫైట్ చేయాల్సిందే : నిరంజన్, బీసీ కమిషన్ చైర్మన్
బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి, ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, చివరకు బీసీ ఆశలపై నీళ్ళు చల్లే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. 50 శాతంలోపు అంటే బీసీలకు నష్టమే. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేయవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కూడా ఇటీవల ఏపీలో ప్రకటించారు. ఆర్టికల్ 308 ద్వారా సవరింపులకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్‌గా పోరాడాలి. కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు జడ్జిల బెంచ్ రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా ఉండొద్దని తీర్పును ఇచ్చాయి. అందుకే ఆ బెంచ్‌ను ఛాలెంజ్ చేస్తూ ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు ప్రయత్నించాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. దీంతో పాటు బీసీ బిల్లులను 9వ షెడ్యూల్‌లో పెట్టే వరకు ఫైట్ చేయాలి. రాజకీయ కారణాలతో బీసీలపై వివక్ష చూపడం కేంద్రంలోని అధికార పార్టీలకు తగదు.
Also Read: Mahesh Babu fitness: మహేష్ బాబులా ఉండాలంటే ఏం చేయాలి.. ఆయన దినచర్య ఇదే..
