Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోమారు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ పేరు ఎత్తితేనే ప్రజలు మండిపడుతున్నారని.. ఆయినా జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ గెలవడానికి బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యమే కారణమని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును వదులుకోవడం బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పొరపాటని కవిత అభిప్రాయపడ్డారు.
‘కుట్ర చేసి పంపారు’
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం తాజాగా ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. మరోమారు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. అనుభవజ్ఞులైన నాయకులను బీఆర్ఎస్ వదులుకుందని అన్నారు. కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవజ్ఞులు కూడా తప్పు చేశారని కవిత ఆరోపించారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నన్ను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ పరిస్థితి కల్పించిన ప్రతీ ఒక్కరి గురించి కచ్చితంగా మాట్లాడతానని కవిత తేల్చి చెప్పారు. తనపై ఇంకా నీచంగా దాడి చేస్తారని తెలుసని.. అయినా బెదిరేది లేదని స్పష్టం చేశారు.
‘నేను ధైర్యవంతురాలిని’
జాగృతి జనం బాట కార్యక్రమంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష బీఆర్ఎస్ సైతం నిద్ర లేస్తోందని కవిత అన్నారు. ‘నేను చాలా ధైర్యవంతురాలిని. ఆరు నెలలు జైల్లో పెట్టినా భయపడలేదు. వేరే వాళ్లైతే డిప్రెషన్ తో ఇంటికే పరిమితమయ్యే వాళ్లు. పార్టీ పెట్టాలనుకుంటే ప్రజలకు వజ్రాయుధమయ్యే విధంగా పార్టీని పెడతాం. పార్టీ పెట్టేది ఉంటే మాత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఢంకా బజాయించి ప్రకటిస్తా. జాగృతి గత 20 ఏళ్లుగా రాజకీయ అంశాలపై మాట్లాడుతోంది. పార్టీ లేకుండా కూడా రాజకీయ అంశాలపై మా పోరాటం కొనసాగుతుంది. నేను బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కనీసం టీచర్ ను కూడా ట్రాన్స్ ఫర్ చేయించుకోలేకపోయా. ప్రస్తుతం నాతో ఉన్న వారంతా కూడా ఒక్క పైసా ప్రయోజనం పొందని వారే’ అని కవిత అన్నారు.
కాంగ్రెస్ ఎలా గెలిచింది?
తన మీద కుట్ర చేసి పార్టీకి, కుటుంబానికి కొందరు పనిగట్టుకొని దూరం చేశారని కవిత పునరుద్ఘటించారు. వారి గురించి ఆధారాలతో సహా కచ్చితంగా మాట్లాడతానని అన్నారు. మరోవైపు బిహార్ లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా గెలిచిందని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినంతగా ప్రతిపక్షాలు చేయడంలేదని దీని అర్థమని కవిత పేర్కొన్నారు. ‘అందుకే జాగృతి సంస్థగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. గతంలో నాతో పనిచేసిన జాగృతి వాళ్లను మా వాళ్లే హేళన చేశారు. వారిని పక్కన పెట్టారు. నా ద్వారా ప్రయోజనం పొంది ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చిన వారు నాతో పాటు రాలేదు’ అని కవిత తెలిపారు.
సీఎం రేవంత్‌కు సూటి ప్రశ్న
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న రేవంత్ సర్కార్ హామీపై కవిత మరోమారు స్పందించారు. ‘తమిళనాడు మాదిరిగా బీసీ రిజర్వేషన్ లను సాధిస్తామంటారు. కానీ ఆ దిశగా ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి తో ఈ అంశంపై మాట్లాడారా? ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సినంత తొందరేమి వచ్చింది. తమిళనాడు లో 9 ఏళ్లు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి పీ.వీ. నరసింహారావు చొరవ తీసుకొని రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు’ అని కవిత చెప్పారు.
Also Read: Maoists Arrest: ఏపీలో మావోయిస్టుల కలకలం.. ఏకంగా 31మంది అరెస్ట్.. పట్టించిన హిడ్మా డైరీ
‘ఖమ్మం రైతుల్ని ఆదుకోండి’
మొంథా తుపాను కారణంగా ఖమ్మం రైతులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారని కవిత అన్నారు. ‘పత్తి రైతుల గోస చాలా దారుణంగా ఉంది. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిరుద్యోగులకు వెంటనే జాబ్ క్యాలెండర్ వేసి దాని ప్రకారం జాబ్స్ నింపాలి. బీసీల కోసం గానీ పత్తి రైతుల కోసం గానీ బీజేపీ నాయకులు ఏమీ చేయటం లేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే ఇక్కడి ప్రజల కోసం పనిచేయటం లేదు. ప్రధాని మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోనైనా సరే పత్తి రైతులకు మేలు చేయాల్సిన నాయకులు ప్రజల కోసం ఏమీ చేయటం లేదు. ప్రజల బాగోగుల్లో పాలు పంచుకోవాలని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నా’ అంటూ కవిత ఫైర్ అయ్యారు.

