Cyber Crime: సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్పపటికీ కొందరు వారి ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ను సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి తెగబడ్డారు. ఏకంగా రూ. 78 లక్షల రూపాయలను ప్రొఫెసర్ నుంచి దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన ఎం.వీ.జీ.ఈ శర్మ విశ్రాంత ఉపాధ్యాయుడ్ని సైబర్ నేరస్తులు మోసం చేశారు. తొలుత ఆయనకు ఫోన్ చేసిన సైబర్ క్రిమినల్స్.. తమను తాము సీబీఐకి చెందిన ఐపీఎస్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. శర్మ వినియోగిస్తున్న మెుబైల్ ఫోన్ లోని సిమ్ కార్డులో సమస్య ఉన్నట్లు చెప్పారు. దానిని సరిచేస్తామని చెప్పి నమ్మించారు.
డిజిటిల్ అరెస్ట్ పేరుతో..
రిటైర్డ్ ప్రొఫెసర్ తో కొద్దిసేపు సంభాషించిన దుండగులు.. ఆ తర్వాత బెదిరింపులకు దిగారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ భయపెట్టారు. దీనిని సరిజేస్తామని చెప్పి ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ అధికారులని నమ్మిన శర్మ.. డిజిటల్ అరెస్టుకు భయపడి వారు అడిగిన అన్ని వివరాలను ఆన్ లైన్ లో సమర్పించారు.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్ తప్పు చేశారు.. కుట్ర చేసి నన్ను పంపేశారు.. కవిత సంచలన కామెంట్స్
రంగంలోకి దిగిన పోలీసులు
అలా శర్మ నుంచి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించిన దుండగులు తమ చేతివాటం ప్రదర్శించారు. పలుమార్లు శర్మ ఖాతా నుంచి నగదును దోచేశారు. 13 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.78.60 లక్షలను ఖాతా నుంచి లూటీ చేశారు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. భీమవరం 2 టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
