Maoists Arrest: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కాకినాడలో మావోయిస్టులు భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. ఏకంగా 31 మందిని అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. అంతకుముందు విజయవాడ శివారులోని కానూరు (పెనమలూరు) కొత్త ఆటోనగర్ ప్రాంతంలో కేంద్ర బలగాలు అనూహ్యంగా సోదాలు చేపట్టాయి. స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు ఓ బిల్డింగ్ ను చుట్టుముట్టాయి. అందులోని అమాయకులను సైలెంట్ గా బయటకు రప్పించి.. బిల్డింగ్ లోకి ప్రవేశించాయి. భవనంలో తలదాచుకుంటున్న మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
9 మంది కేంద్ర కమిటీ సభ్యులు..
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో అటవీ ప్రాంతంలో ఉదయం జరిగిన హిడ్మా ఎన్ కౌంటర్ తో పాటు.. విజయవాడ, కాకినాడలో జరిగిన సోదాల గురించి ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో అల్లురి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడుతూ.. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 12 మహిళలతో పాటు మిలషీయా సభ్యులు, సానుభూతి పరులు ఉన్నట్లు పేర్కొన్నారు.
కార్మికుల పేరుతో షెల్టర్
విజయవాడ కొత్త ఆటోనగర్ లో అరెస్టైనవారంతా ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన వారేనని ఇంటెలిజెన్స్ ఏడీజీ ధ్రువీకరించారు. కార్మికుల పేరిట వచ్చి కొద్దిరోజుల కిందట అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త ఆటోనగర్ లో చేపట్టిన ఆపరేషన్ లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని.. మరో ఆరుగురు చేతికి చిక్కకుండా తప్పించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.
భారీగా ఆయుధాలు పట్టివేత
పక్కా సమాచారంతో గత రెండ్రోజులుగా గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీజ్ చేసిన ఆయుధాల వివరాలు ఇలా ఉన్నాయి.
❄️ ఏకే 47 – 2
❄️ పిస్టోల్ – 1
❄️ రివాల్వర్ – 1
❄️ సింగిల్ బోర్ ఆయుధం – 1
❄️ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు – 1525
❄️ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు – 150
❄️ ఎలక్ట్రికల్ వైర్ బండిల్ – 1
❄️ కెమెరా ఫ్లాష్ లైట్ – 1
❄️ కటింగ్ బ్లేడ్ – 1
❄️ ప్యూజ్ వైర్ – 25 మీటర్లు
❄️ కిట్ బ్యాగులు – 7
Also Read: Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. సొంత అల్లుడితో సిట్టింగ్.. ఆపై బురదలో కుక్కి చంపిన మామలు
హిడ్మా సహా ఆరుగురు మృతి
మరోవైపు అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉదయం 6.30 – 7.00 మధ్య మావోయిస్టులు – పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ స్పష్టం చేశారు. పోలీసుల కాల్పుల్లో హిడ్మా, ఆయన భార్య సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. అయితే ఘటనాస్థలిలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగానే విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఎక్కడ తలదాచుకున్నారన్న వివరాలను హిడ్మా తన డైరీలో పూసగుచ్చిన్నట్లు రాసుకున్నారని సమాచారం. ఈ కారణం చేతనే నేరుగా మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను బలగాలు చుట్టుముట్టినట్లు అర్థమవుతోంది. మరోవైపు 2026 నాటికి మావోలను ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవుల్లో రహస్యంగా దాక్కున్నా వారిని బలగాలు మట్టుబెడుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత అయిన హిడ్మాను హతమార్చడం ద్వారా కేంద్ర బలగాలు మరో కీలక విజయాన్ని సాధించాయి.
