KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి దిగి, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ నేతల దాడిలో గాయపడిన బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు చేసిందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ కూడా చేష్టలు ఉడిగి చూసిన వైనం ఫలితంగానే మేము సాంకేతికంగా ఓడిపోయామన్నారు.
Also Read: KTR Meets Sunitha: జూబ్లీహిల్స్‌లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
మేము ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా?
పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారని ఎన్నడన్నా మా ప్రభుత్వ పాలనలో మా కార్యకర్తలు హద్దులు దాటి దాడులు చేశారా అని ప్రశ్నించారు. ఒక ఉప ఎన్నికల్లో గెలువగానే మా పార్టీ గుర్తైన కారును ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించారని అన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు మేము ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
కక్షపూరితంగా రౌడీయిజం
రాకేష్ క్రిస్టోఫర్ పై జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డియే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా రౌడీయిజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా, కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది.. పార్టీది.. వదిలిపెట్టే సమస్య లేదన్నారు.
మా అభ్యర్థికి 75 వేల ఓట్లు
ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వారి ఇంటి ముందుకు వస్తాం అని హామీ ఇచ్చారు. ఇన్ని రిగ్గింగ్‌లు, గూండాగిరి, దొంగ ఓట్లు, పైసలు, చీరలు, కుక్కర్లు పంచినా కూడా మా అభ్యర్థికి 75 వేల ఓట్లు వచ్చాయని, ఇది స్వల్ప సంఖ్య కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు సంయమనంతో వ్యవహరించకపోతే, తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సునీతకు ధైర్యం చెప్పిన కేటీఆర్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను శనివారి జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఎన్నికల్లో సునీత గోపీనాథ్ తో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు.
Also Read: KTR: జూబ్లీహిల్స్ ఓటమితో.. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్యూర్ అనే ప్రచారం
