KTR (imagecredit:swetcha)
Politics, తెలంగాణ

KTR: జూబ్లీహిల్స్ ఓటమితో.. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్యూర్ అనే ప్రచారం

KTR: ‘ మా అన్నదమ్ములకు.. అక్క చెళ్లెల్లను ఒకటే కోరుతున్నా..ఈ పోటీ ఆశామాయిషీ పోటీ కాదు..ఇదేదో ఆల్తుఫాల్తు ఎలక్షన్ కాదు.. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు, బుల్‌డోజర్ కు.. పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుందా.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన బాగుందా?.. నాలుగు లక్షల మంది టర్లున్నారు జూబ్లీహిల్స్ లో.. నాలుగుకోట్ల ప్రజల తరుపున మీరే జడ్జీలు.. మీరే నాయనిర్ణేతలు..మ‌ళ్లీ కేసీఆర్ రావాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్ర‌యాత్ర స్టార్ట్ కావాలి’ అని ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలు

తన సత్తాను చాటేందుకు శాయశక్తుల కృషి..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నిక బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. గెలుపుకోసం ప్రణాళికలు రూపొందించారు. అన్నీతానై వ్యూహాలను రచించారు. ఎప్పటికప్పుడు నేతలు, కేడర్ తో భేటీ అయి ప్రచార సరళిపై దిశానిర్దేశం చేశారు. మానిటరింగ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తన సత్తాను చాటేందుకు శాయశక్తుల కృషి చేశారు. కానీ ఫలించలేదు. పార్టీ 25వేల ఓట్లతో ఓడిపోవడం ఇప్పుడు పార్టీలో విస్తృత చర్చజరుగుతుంది. భవిష్యత్ లో పార్టీని నడిపించేది కేటీఆర్ అని ప్రచారం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందిగ్ధంలో పడేసింది. పార్టీ సీనియర్ నేతలు, కేడర్ సైతం కేటీఆర్ సమర్దతపై చర్చించుకుంటున్నట్లు సమాచారం.

పార్టీ నాయ‌క‌త్వ పగ్గాలు

బీఆర్ఎస్ పార్టీ క్యాడ‌ర్ కేటీఆర్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌డం లేదా? అనే ప్రచారం సైతం జరుగుతుంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక‌లో ఓడిపోయింది కేవ‌లం బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత మాత్ర‌మే కాదని, కేటీఆర్ నాయ‌క‌త్వం కూడా ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇన్ని రోజుల‌పాటు పార్టీలో ఎవ‌ర్ని ఎద‌గ‌నివ్వ‌కుండా కేటీఆర్ వ్యవహరించారని, ఈ ఉపఎన్నిక ద్వారా అన‌ధికారికంగా పార్టీ నాయ‌క‌త్వ పగ్గాలు చేజిక్కించుకున్నారనే వాద‌న ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో స్వ‌యంగా తానే పోటీ చేస్తున్నంతటి స్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించి, పోల్ మేనేజ్‌మెంట్ చేసిన‌ కేటీఆర్ చివ‌రికి ఓటమిని చవిచూశారని గులాబీ కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ఓట‌మితో పార్టీని న‌డిపే సామ‌ర్థ్యం కేటీఆర్‌కు లేద‌నే ప్రచారం జరుగుతుంది.

జూబ్లీహిల్స్‌లో ఓట్‌చోరీ అంటూ..

ఎమ్మెల్సీ క‌విత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన త‌రువాత కేటీఆర్‌ మొద‌టిసారి ఈ ఉపఎన్నిక‌లో అంతా తానై న‌డిపారు. పార్టీ ప‌గ్గాల్ని ఆయ‌న వ‌శం చేసుకున్నార‌నేందుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఉపఎన్నిక‌లో గెలుపు కోసం ప‌నిచేయ‌కుండా ఓటమి త‌ప్ప‌ద‌ని తెలిసే సాకులు వెతికార‌ని, అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లో ఓట్‌చోరీ అంటూ ఎన్నిక‌ల‌కు ముందే చేతులెత్తేశార‌ని చర్చ మొదలైంది. 2014 నుంచి 2023 వ‌ర‌కు దొంగ ఓట్ల అంశాన్ని ఎందుకు లేవ‌నెత్త‌లేద‌ని కార్య‌క‌ర్త‌లే ప్ర‌శ్నిస్తున్నారు. అతి కొద్ది మందికి మాత్ర‌మే కేటీఆర్ అందుబాటులో ఉంటున్నారని, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు కలిసేందుకు కూడా మొగ్గుచూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు పార్టీ కింది స్థాయి క్యాడ‌ర్ న‌మ్మ‌కాన్ని ఎప్పుడో కోల్పోయార‌నే చ‌ర్చ జరుగుతుంది. బీఆర్ఎస్‌లో ఇత‌ర నేత‌ల్ని ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డం, అన్యాయాన్ని ప్ర‌శ్నించిన నేత‌ల‌పై కేటీఆర్ వేటువేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీనియ‌ర్ నేత‌లు విజ‌య‌శాంతి, ఈట‌ల రాజేంద‌ర్‌, క‌విత వ‌ర‌కు పార్టీలో నాయ‌క‌త్వం త‌యారుకాకుండా అంద‌రినీ వ్యూహాత్మ‌కంగా త‌ప్పించార‌నే ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వంటి సీనియ‌ర్ల‌ను సైతం పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారనే ప్రచారం జరిగింది.

Also Read: CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు

బీఆర్ఎస్‌ గెలిస్తే..

బీఆర్ఎస్ పార్టీపై క‌విత ప‌ట్టు సాధించ‌కుండా వ్యూహాత్మ‌కంగా కేటీఆర్ ఆమెను ప‌క్క‌కు త‌ప్పించార‌నే ప్ర‌చారం జరిగింది. అంతేకాకుండా చివ‌రి మూడు రోజుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న హ‌రీష్ రావును కూడా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయకుండా కేటీఆర్ ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పించార‌ని, బీఆర్ఎస్‌ గెలిస్తే క్రెడిట్ మొత్తం తానే తీసుకోవ‌డానికి దూరం పెట్టార‌ని, క‌నీసం అభ్య‌ర్థితో కలిసి ప్ర‌చారం చేయ‌నివ్వ‌లేద‌నే ప్రచారం జరుగుతుంది. దీని వ‌ల్లే హ‌రీష్ రావు ఒంట‌రిగా ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ చేసేదంతా సోష‌ల్ మీడియా పాలిటిక్స్ అని, కేవ‌లం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డానికి హంగూ ఆర్భాటాల‌తో రాజ‌కీయాలు చేస్తున్నార‌నే చ‌ర్చ ఊపందుకుంది.

అధికారంలో ఉన్న‌ప్పుడు

అధికారంలో ఉన్న ప‌దేళ్లలో కేటీఆర్‌ ఎన్న‌డూ జూబ్లీహిల్స్ వైపు చూడ‌లేద‌ని, ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని స్థానిక బీఆర్ఎస్ నేత‌లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చి ఇత‌రుల్ని నిందిస్తే ఏం ప్ర‌యోజ‌నం అని పలువురు గుస‌గుస‌లాడుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌ను ఎన్న‌డూ ప‌ట్టించుకోని కేటీఆర్‌పై కింది స్థాయి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎప్పుడో న‌మ్మ‌కం కోల్పోయార‌ని, ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫ‌లితాల‌తో ఆయన సామ‌ర్థ్యం మ‌రోసారి రుజువైంద‌ని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు

మాగంటి సునీత‌పై ముందు నుంచీ నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర‌ వ్య‌తిరేక‌త ఉంద‌ని, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను అధ్యయనం చేయ‌డంలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. పార్టీ నేతలు ఆమెపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలిపినా పట్టించుకోలేదని, గోపీనాథ్ చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పదేళ్లు చేసిన అభివృద్ధే, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ తో ఈ ఉపఎన్నిక‌లో బీఆర్ఎస్ గెలుస్తుంద‌ని కేటీఆర్ అతివిశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే, బీఆర్ఎస్ గెలిస్తే ఇది త‌న గెలుపుగా చిత్రీక‌రించుకొనేందుకు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చార‌ని ప్రచారం జరుగుతుంది. ఇలా ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తెలుసుకోలేక కేటీఆర్ ఫెయిల్ అయ్యార‌ని, స‌రైన అభ్య‌ర్థి ఎంపిక‌లోనూ ఫెయిల్ అయ్యార‌ని, మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్, కింది స్థాయి నేత‌ల్ని క‌లుపుకొనిపోవ‌డంలో ఫెయిల్ అయ్యార‌ని ప్ర‌జ‌లతో పాటు పార్టీలో, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

Also Read: Soy Milk vs Cow Milk: సోయా పాలు vs ఆవు పాలు.. వీటిలో ఏది ఆరోగ్యకరం?

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!