INDIA Alliance: ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా?, కూటమిలో అంతర్గత నాయకత్వంలో మార్పులు వస్తాయా?, చాలా ఓటములు ఎదురైన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీలు ఇకపై కూడా కలిసి వస్తాయా?, ఎలాంటి మార్పులు ఉండవచ్చు?. బీహార్‌లో (Bihar) మహాఘట్ బంధన్ ఘోర ఓటమి వేళ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఒకటా.. రెండా!.. విపక్షాల ఇండియా కూటమి (INDIA Alliance) వరుస పరాజయాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఘోరమైన పరాజయం పలకరించింది. మహాఘట్‌బంధన్ దారుణ పరాభవాన్ని చవిచూసింది. దీంతో, ఇండియా కూటమి భవిష్యత్తుపై ఊహాగానాలు, రాజకీయ చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు సీట్లకే పరిమితం కావడం, ఆర్జేడీ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇండియా కూటమిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కూటమి విశ్వసనీయత, దీర్ఘకాల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వ లోపాలు, సమష్టి నిర్ణయాల విషయంలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి.
నిజానికి, మొదటి నుంచీ ఇండియా కూటమి నిర్మాణంపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బీహార్ ఫలితం ఇండియా కూటమి మనుగడపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలోని పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కచోట చేరాయి. కమలనాథులను ఓడించాలని సంకల్పంగా నిర్దేశించుకున్నాయి. కానీ, వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నాయి. బీహార్ వంటి కీలక రాష్ట్రంలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోవడం కూటమి తీవ్ర నష్టం చేయడం ఖాయమనే విశ్లేషిస్తున్నాయి. ఇండియా కూటమి పునాదులపై మళ్లీ చర్చ జరగాల్సిన అవసరం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also- Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో షాక్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ వీడియోలు
స్పష్టమైన హైకమాండ్ ఏదీ?
ఇండియా కూటమి ఏర్పడి కొన్నేళ్లు గడుస్తున్నా, ఇప్పటికే లెక్కలేనన్ని ఓటములు ఎదురైనా ఇంకా నాయకత్వ మార్పులు జరగడం లేదు. కూటమిలో స్పష్టమైన హైకమాండ్ ఏదీ? అనే జవాబులేని ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జాతీయ నాయకుడిగా ముందు నిలబెడుతున్నా, ఆయన నాయకత్వాన్ని పూర్తిగా కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరిస్తున్న దాఖలాలు లేవు. దీంతో, బీహార్ ఓటమి తర్వాత కూటమిలోని భిన్నాభిప్రాయాలు మరింత స్పష్టంగా బయటకు కనిపిస్తున్నాయి. కూటమి సమర్థవంతంగా పనిచేయాలంటే మరింత సమన్వయం, స్పష్టమైన నాయకత్వం పనిచేసే నాయకత్వ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇన్ని ఓటముల తర్వాత కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారధ్యంలో కూటమిలోని ఇతర పార్టీలు కలిసి వస్తాయా? అనే ప్రశ్న బీహార్ ఎన్నికల వేళ వ్యక్తమవుతోంది. కొన్ని పార్టీలు రాహుల్ వెంట నడిచేందుకు అంగీకరిస్తున్నప్పటికీ, మరికొన్ని పార్టీలు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కోరే అవకాశం లేకపోలేదు. అయితే, బీజేపీ ఆధిపత్యం, ఎన్నికల్లో విజయాలు నానాటికీ పెరిగిపోతున్న వేళ కూటమి విడిపోతే, కమలనాథులకు మరింత తిరుగులేకుండా పోవచ్చనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. దీంతో, భవిష్యత్ సన్నద్దత కోసం కూటమి ఏవిధమైన చర్యలు తీసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌కు ఇబ్బందే!
కాంగ్రెస్ ఘోర వైఫల్యం వేళ ప్రాంతీయ పార్టీలు తమ బలం ఉన్నచోట కాంగ్రెస్ బలహీనతను చూపి, సీట్ల సర్దుబాటులో మరింత గట్టిగా పట్టుబట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఓటమి ప్రాంతీయ పార్టీల నాయకులు మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా ప్రేరేపిస్తుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో కూటమి పటిష్టతను తగ్గించవచ్చని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి, బీహార్‌లో దారుణ ఓటమి ఇండియా కూటమిని ఒక కీలక మలుపు వద్ద నిలబెట్టినట్టు అయింది. మనుగడ కోసం ఇండియా బ్లాక్ పునర్నిర్మాణం జరుగుతుందా?, నాయకత్వ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా?, వ్యూహాత్మక మార్పులు చేస్తారా?, లేదా? అనేది కూటమి పెద్దల చేతుల్లోనే ఉంది.
