Uttam Kumar Reddy: శుక్రవారం జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ (Naveen kumar Yadav) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి సునీతపై (Maganti Sunitha) 24,729 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ నవీన్ యాదవ్‌కే ఆధిక్యం లభించినప్పటికీ, ఇంచుమించుగా 25 వేల ఓట్ల మెజారిటీ మార్క్ సాధించడంలో మాత్రం నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో ఆ పార్టీకి పడ్డ ఓట్లు దోహదపడ్డాయి. హస్తం పార్టీని ఓటర్లు బాగా ఆదరించిన జాబితాలో యూసుఫ్‌గూడ డివిజన్ టాప్‌లో నిలిచింది. దీంతో, ఈ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ బృంద సభ్యుల్లో ఒకరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హర్షం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని తెలియజేస్తూ ఎన్నికల సంఘం డివిజన్ల వారీగా విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాపై స్పందించారు.
నాకు సంతోషంగా ఉంది
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటా ఇదని, యూసుఫ్‌గూడ డివిజన్‌లో పార్టీకి 55 శాతం ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికకు సంబంధించి డివిజన్‌లో అన్ని సమస్యలను పర్యవేక్షించిన కాంగ్రెస్ బృందంలో భాగస్వామిగా ఉన్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ 21 శాతం ఎక్కువ మెజారిటీని దక్కించుకుందని, అందుకే ఉత్తమ ఫలితాన్ని సాధించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. పోల్ నిర్వహణలో సహాయం చేసిన ఆరా ఏజెన్సీకి చెందిన మస్తాన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Read Also- CM Revanth Reddy: ఆత్మవిశ్వాసంతో ఫైట్.. గులాబీని మట్టి కురిపించేందుకు కంకణం
డివిజన్లవారీగా కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు
షేక్‌పేట్ (94)- ఈ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 48 శాతం, బీఆర్ఎస్‌కు 42 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి. ఇక, ఎర్రగడ్డ(101) డివిజన్‌లో కాంగ్రెస్‌కు 48 శాతం, బీఆర్ఎస్‌కు 40 శాతం, బీజేపీకి 10 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. వెంగళ్‌రావు నగర్(99)లో హస్తం పార్టీకి 52 శాతం, బీఆర్ఎస్‌కు 35 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున ఓట్లు పొందాయి. రెహమ్మత్ నగర్(102)లో కాంగ్రెస్‌కు 53 శాతం, బీఆర్ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 6 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పడ్డాయి. సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీకి 51 శాతం, బీఆర్ఎస్‌కు 32 శాతం, బీజేపీకి 15 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి.
ఇక, అత్యధికంగా యూసుఫ్‌గూడ్ డివిజన్‌లో హస్తం పార్టీకి 55 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న బీఆర్ఎస్‌కు 34 శాతం, బీజేపీకి 7 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు వచ్చాయి. చివరిగా, బోరబండ డివిజన్‌లో హస్తం పార్టీకి 49 శాతం, బీఆర్ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 7 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున ఓటింగ్ శాతాలు నమోదయ్యాయి. నియోజకవర్గం మొత్తంగా చూస్తే, కాంగ్రెస్‌కు 51 శాతం, బీఆర్ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 9 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున ఓట్లు పడ్డాయి.
Read Also- KTR Meets Sunitha: జూబ్లీహిల్స్‌లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
