CM Revanth Reddy: ఎన్నికలు ఏవైనా, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం పక్కాగా పనిచేస్తుందని, ఆయన స్ట్రాటజీ తిరుగులేని విజయాలను అందిస్తూ ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేస్తోందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో ఊపందుకుంది. 2019 మల్కాజ్‌గిరి ఎంపీ ఎన్నికల నుంచి మొదలుకుని, తాజాగా జరిగిన 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు ఆయన వ్యూహం కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రాజకీయ ప్రయాణంలో పోరాట పటిమ ప్రధాన బలం.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి
ఎన్నిక ఏదైనా
ఆయన ఏ చిన్న ఎన్నికను కూడా తేలికగా తీసుకోకుండా, పూర్తి శక్తిని వినియోగించి ప్రచారం చేయడం కనిపిస్తుంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు, క్లిష్టమైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో గెలిచి, జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో, దూకుడుగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి, పార్టీని బలోపేతం చేశారు. తన మాటలు, హామీలు, ప్రత్యర్థులపై విమర్శల్లోని ధైర్యం ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని పెంచాయి. బీఆర్‌ఎస్‌ను మట్టి కురిపించడం కోసం ప్రత్యేక స్ట్రాటజీని ఆయన ఎంచుకున్నారు. పదేళ్ల పవర్‌లో శక్తివంతంగా ఉన్న కేసీఆర్‌ను ఓడించేందుకు ఆత్మవిశ్వాసంతో, తన మేధస్సుకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ రాజకీయ పరంగా ఎదుర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, కానీ ఎక్కడా ఓర్పు కోల్పోకుండా బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కృషి చేయడం గమనార్హం.
నాటి నుంచి నేటి వరకూ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో ఆరు గ్యారంటీల అస్త్రం ముఖ్యమైనది. ఇవి ముఖ్యంగా మహిళలు, పేదలు, యువతను ఆకర్షించేలా పథకాలు రూపొందించడం అనుకూల ఫలితాలు రావడానికి దోహదపడింది. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడి హోదాలో దూకుడైన ప్రసంగాలతో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోని లోపాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ వైపునకు తిప్పడంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (2025)లో కాంగ్రెస్ విజయం, ఆయన నాయకత్వానికి, వ్యూహాలకు తిరుగులేని నిదర్శనం. రేవంత్ ప్రచారం మొదలు పోల్ మేనేజ్‌మెంట్ వరకు పకడ్బందీగా అమలు పరుచుతారు. మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్‌ను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఇది స్పష్టమైంది.
కారుకు బ్రేక్
కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీ వాసులను ఏకం చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఎలాంటి గ్యాప్‌లు లేకుండా వారికి అభివృద్ధి, సంక్షేమంపై హామీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ముస్లిం ఓటర్లను పొందేందుకు ఎంఐఎం మద్దతు పొందడంతో పాటు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి కీలక వ్యూహాన్ని అమలు చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌ను పర్ఫెక్ట్‌గా పూర్తి చేసి ఏకంగా బీఆర్‌ఎస్‌కు బూత్ స్థాయి ఏజెంట్లు లేకుండా చేయడం గమనార్హం. అందరి కంటే ముందు టిక్కెట్ ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం చెక్ పెట్టింది. బీఆర్‌ఎస్ కీలక స్థానాన్ని కోల్పోవడం, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పట్టు సాధించడం రేవంత్ రెడ్డి వ్యూహం శక్తిని స్పష్టం చేసింది. ఈ విజయం రాబోయే ఎన్నికల విజయం ఆశలను పెంచింది.
Also Read: CM Revanth Reddy: ప్రపంచ పెట్టుబడులకు.. హైదరాబాద్ గమ్యస్థానం.. సీఎం రేవంత్ రెడ్డి
