Bihar CM Race: బీహార్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఇంకా చెప్పాలంటే, అంచనాలకు మించి, ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ఎన్డీయే కూటమి ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. చారిత్రాత్మక రీతిలో 208 సీట్లు గెలుచుకునే దిశగా కూటమిలోని జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ పార్టీల అభ్యర్థులు దూసుకెళుతున్నారు. ఇక, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్ కూటమి దారుణాతి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రతిపక్షం మాట పక్కనపెడితే, సార్వత్రిక ఎన్నికలో విజయదుందుభి మోగించిన ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థి ఎవరు?, మళ్లీ నితీశ్ కుమార్ యాదవ్ చేతికే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా?, లేక, ఈసారి ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని (Bihar CM Race) ఆశిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయ విశ్లేషణల వేళ ఆసక్తికర పరిణామం చర్చనీయాంశంగా మారింది.
జేడీయూ ట్వీట్.. డిలీట్.. ఆంతర్యమేమిటి?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నిర్ణయాత్మక విజయం సాధించిన క్రమంలో జేడీయూ పార్టీ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ విజయం అపూర్వం, అద్వితీయం అని పేర్కొంది. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ఉన్నారు, కొనసాగుతున్నారు, ఉంటారు అని జేడీయూ ట్వీట్‌లో పేర్కొంది. కానీ, ఆ కొద్దిసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేయడం ‘సీఎం పీఠం’పై ఊహాగానాలకు తెరతీసింది. ఈ పరిణామం నితీష్ కుమార్ ‘ముఖ్యమంత్రి పదవి భవితవ్యం’పై ఒక్కసారిగా చర్చకు దారితీసింది. నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్‌లో పోటీ చేస్తున్నామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన విషయం విధితమే. అయితే, నితీశ్ కుమార్‌కే ఆ సీఎం పీఠం దక్కుతుందని కమలనాథులు ఎక్కడా చెప్పలేదు.
సందేహాలు వస్తోంది అందుకే..
బీహార్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సీట్ల పరంగా బీజేపీ అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించింది. జేయూడీకి 83 సీట్లు దక్కగా, బీజేపీ ఏకంగా 93 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, ముఖ్యమంత్రి పీఠంపై కమలనాథులు పట్టుబడతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ, సీట్ల సంఖ్య పరంగా బీజేపీని అధిగమించలేకపోయింది. ఈ సమీకరణాల్లో సీఎం పీఠం ఎవరికి? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో మాదిరిగా, బీహార్‌లో కూడా బీజేపీ తమ పార్టీ నాయకుల్లో ఒకర్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చూడవచ్చనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీహార్‌లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి… ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారుగా ఉన్నారనే రాజకీయ ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Read Also- Jio Hotstar: 1 బిలియన్ డౌన్‌లోడ్స్ క్లబ్‌లో జియోహాట్‌స్టార్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫెక్ట్?
బీజేపీ పక్కా వ్యూహం
బీహార్ ఎన్నికల్లో బీజేపీ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. బీహార్‌లో ఎన్డీయే కూటమికి నితీశ్ కుమార్‌ను పెద్దన్నగా, జేడీయూ పార్టీలో సారధ్యంలో ముందుకు వెళ్తున్నట్టుగా ప్రకటించుకుంటూ వచ్చింది. అయితే, సీట్ల పంపకం దగ్గర మాత్రం చెరో 101 సీట్లలో పోటీ చేసేలా ఒప్పించుకుంది. వ్యూహానికి తగ్గట్టుగా జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో, సీఎం పదవిని అడుగుతారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ, బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ మనసులో ఏముందో త్వరలోనే బయటపడనుంది.
