Al Falah University: దిల్లీ పేలుడు ఘటనతో పాటు పట్టుబడ్డ ఉగ్రవాదుల మూలాలు అల్ ఫలాహ్ యూనివర్శిటీ (Al Falah University)లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ ఫండ్స్ పై విచారణ చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను ఆదేశించింది. అలాగే అక్కడి వైద్యుల ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు చేయాలని సూచించింది. కాగా దిల్లీ పేలుడుకు సంబంధించి అల్ ఫలాహ్ యూనివర్శిటీ కేంద్రంగానే పథకం రచించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పేలుడు వెనుక నలుగురు వైద్యులు
దిల్లీలోని ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ పేలుడు వెనుక డా. ఉమర్ (పేలిన కారు డ్రైవర్), డా. షాహీన్ సయీద్, డా. ఆదిల్ రాథర్, డా. ముజమ్మిల్ షకీల్ అనే నలుగురు వైద్యులు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నలుగురు వైద్యులు అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన వారు కావడం గమనార్హం.
యూనివర్శిటీలోనే ప్లాన్
యూనివర్శిటీలోని డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గదిని దర్యాప్తు అధికారులు పరిశీలించగా అందులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, కోడ్ భాషలో సందేశాలు రాసి ఉన్న డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులంతా.. ముజమ్మిల్ గదిలోనే తరుచూ భేటి అయ్యేవారని కూడా తేల్చారు. అంతేకాదు ఉగ్రదాడికి సంబంధించిన ప్రణాళికల గురించి కూడా ముజమ్మిల్ గదిలోనే చర్చించినట్లు సమాచారం. బాంబు తయారీలో ఉపయోగించే రసాయనాలను కూడా యూనివర్శిటీలోని ప్రయోగశాల నుంచి వారు అక్రమంగా తీసుకున్నట్లు తేలింది.
Also Read: Red Fort Blast: దిల్లీలో ఒకటి కాదు.. 4 కార్లతో పేలుళ్లకు కుట్ర.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఒకేసారి దాడికి కుట్ర
దేశవ్యాప్తంగా 4 ప్రదేశాల్లో ఒకేసారి దాడులు చేయాలని ఈ అనుమానిత వైద్యులు కుట్ర పన్నినట్లు సమాచారం. ఇందుకోసం 8 మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్దం చేసినట్లు తెలిసింది. ఇద్దరిద్దరి చొప్పున నాలుగు ప్రాంతాలకు వెళ్లి అత్మాహుతి చేసుకోవాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఈ ఎనిమిది మందిలో అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన నలుగురు వైద్యులు ఉమర్, ముజమ్మిల్, ఆదిల్, షాహీన్ ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
మాకు సంబంధం లేదు: వీసీ
అల్ ఫలాహ్ యూనివర్శిటీ విషయానికి వస్తే అది దిల్లీ – హర్యానా సరిహద్దుల్లో ఉంది. ఫరిదాబాద్ కు 27 కి.మీ దూరంలో 70 ఎకరాల విస్త్రీర్ణంలో నడుపబడుతోంది. అయితే బుధవారం యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పట్టుబడ్డ వైద్యులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దిల్లీ పేలుడు అనుమానితుల్లో ఇద్దరు మాత్రమే తమ యూనివర్శిటీకి చెందినవారని వీసీ భూపిందర్ కౌర్ ఆనంద్ స్పష్టం చేశారు. వారితో కేవలం వృత్తిపరమైన రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. కావాలనే తమ యూనివర్శిటీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
