Delhi Blast Case: దిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది ఉగ్రదాడి కావొచ్చన్న అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. దాడి ఘటనపై విచారణ జరిపే బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
ఉగ్రమూలాల నేపథ్యంలో..
సోమవారం రాత్రి దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారు పేలుడు సంభవించింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రెడ్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న హ్యూందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పక్కన ఉన్న వాహనాలకు సైతం మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి మృతదేహాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. పేలుడు స్వభావం, వ్యక్తమవుతున్న అనుమానాల దృష్ట్యా ఈ కేసును ఎన్ఐఏకు బదలాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
రంగంలోకి దిగిన ఎన్ఐఏ
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో దిల్లీ బ్లాస్ట్ కేసుపై ఎన్ఐఏ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, దాడి వెనుక ఉగ్ర కోణాలను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు ఇప్పటికే సంఘటన స్థలం నుంచి పలు ఆధారాలను సేకరించింది. వాటిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకొని సమగ్రంగా దర్యాప్తు చేపట్టే అవకాశముంది.
హోంశాఖ అత్యున్నతస్థాయి సమీక్ష
మరోవైపు దిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రెండు అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మెుదటి భేటి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అమిత్ షా నివాసంలో జరిగింది. ఈ భేటిలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటిలిజెన్స్ బ్యూరో తపన్ డేకా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్, దిల్లీ పోలీసు కమిషనర్ సతీష్ గోల్చా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్ గా హాజరయ్యారు.
Also Read: Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?
ఫరీదాబాద్ లింకప్‌పై చర్చ
రెండో సమీక్షా సమావేశం మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో జరిగింది. దిల్లీలోని హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో జరిగింది. ఈ రెండు సమావేశాల్లోనూ దిల్లీ పేలుడు వెనకున్న మూలాలపై చర్చ జరిగింది. ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనానికి.. కారు బ్లాస్ట్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న అంశంపై కూడా చర్చ జరిగింది. దర్యాప్తు బాధ్యతను కేంద్రం తమకు అప్పగించడంతో ఎన్ఐఏ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది.
