Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
Jubilee Hills bypoll ( IMAGE credit: swetcha reporter)
Political News

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్!

Jubilee Hills bypoll జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక ప్రక్రియలో భాగంగా మంగళవారం పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. సెప్టెంబర్ 30న ఎన్నికల షెడ్యూల్ వెలువడగా, అక్టోబర్ 13న జిల్లా ఎన్నికల అధికారి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా, అన్ని రకాల ప్రక్రియలు ముగిసిన తర్వాత దాదాపు 58 మంది అభ్యర్థులు ఈ ఎమ్మెల్యే సీటు బరిలో నిలిచారు. కానీ ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, ప్రతి పక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ ఒక్క స్థానం మాత్రమే ఉండగా, ఇపుడు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంది.

Also Read: Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం

ప్రతి పక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న విషయంతో ప్రజల్లోకెళ్లి కాంగ్రెస్ ను ఓడించి, సిట్టింగ్ సీటును కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం జరిగింది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు విజేతలు అన్న విషయం తేల్చేందుకు ఎన్నికల యంత్రాంగం మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

అన్ని పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్

ఎలక్షన్ మెటీరియల్ ను సరఫరా చేసేందుకు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ) ను ఏర్పాటు చేసి, సోమవారం అక్కడి నుంచే పోలింగ్ బూత్ లలో వినియోగించునున్న ఎలక్షన్ మెటీరియల్ ను ప్రెసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లకు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నేరుగా పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం అయిదు గంటలకు అన్ని పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఉదయం ఏడు గంటల నుంచి సాధారణ పోలింగ్ నిమిత్తం ఓటర్లను అనుమతించాలని సూచించారు. ఈ సారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు కన్పించేలా బ్యాలెట్ ను సిద్దం చేశారు.

ఎలక్షన్ మ్యాన్ పవర్, మెటీరియల్

ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 అభ్యర్థులుండగా, వీరితో పాటు నోటా బటన్ తో మొత్తం 59 మంది బరిలో ఉన్నట్లు అధికారులు బ్యాలెట్ ను సిద్దం చేశారు. ఒక్కో ఈవీఎంలో కేవలం 16 మంది అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్ కు అవకాశముండటంతో ఒక్కో పోలింగ్ బూత్ లో సుమారు నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించేలా ఎలక్షన్ వింగ్ అధికారులు మెటీరియల్ ను సిద్దం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి రిజర్వులో ఉండాల్సిన మెటీరియల్ తో పాటు మొత్తం 1494 బ్యాలెట్ యూనిట్లు, 826 కంట్రోల్ యూనిట్లు, మరో 837 వీవీ ప్యాట్ లను వినియోగించేందుకు వీలుగా మెటీరియల్ ను సిద్దం చేశారు. బై ఎలక్షన్ ప్రక్రియలో కీలకమైన విధులు నిర్వర్తించే మూడు క్యాటగిరీల్లో మొత్తం 2474 మంది అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 600 మంది ప్రెసిడింగ్ ఆఫీసర్లు, మరో 600 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లు కాగా, అదర్ పోలింగ్ ఆఫీసర్లుగా 1200 మందిని రిజర్వుతో కలిపి నియమించారు. వీరితో పాటు మరో 19 మంది అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించగా, నియోజకవర్గాన్ని 38 సెక్టార్లుగా విభజించి ఇతర ఎన్నికల విధుల నిర్వహణ కోసం మరో 55 మంది ఆఫీసర్లను సెక్టార్ ఆఫీసర్లుగా నియమించారు.

స్వల్పంగా పెరిగిన ఓటర్లు

ఈ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరిగే చివరి రోజు వరకు కూడా కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అనుమతినివ్వటంతో ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత నియోజకవర్గం ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 4 లక్షల 1365 మంది ఉన్నట్లు, ఇందులో పురుషులు 2 లక్షల 8 వేల 561 మంది ఉండగా, మహిళా ఓటర్లు లక్షా 92 వేల 779 మంది, అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు మరో 25 మందితో కలిపి మొత్తం 4 లక్షల 1365 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 9 పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1233 మంది ఓటర్లుండగా, 263 పోలింగ్ స్టేషన్లలో 540 మంది ఓటర్లున్నట్లు, ఇక 1200 కన్నా ఎక్కువ మంది ఓటర్లు 11 పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుండగా, 139 ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లపై డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు.

ఓటింగ్ శాతం పెంపునకు చర్యలు

దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం పడిపోవటాన్ని భారత ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ప్రజాప్రతినిధుల ఎన్నికలో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు ఏ ఎన్నిక జరిగినా, తప్పకుండా ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుని, స్వీప్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచింది. సాధారణంగా ఇప్పటి వరకు అమలైన నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నాం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించేవారు. కానీ జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రక్రియను ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, అంటే అదనంగా మరో గంట నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు సమాచారం.

ఉద్యోగులకు సెలవు ప్రకటించాలి

సాధారణంగా ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ జరగనున్న రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎప్పటికపుడు ఎన్నికల విభాగం అధికారులు సిఫార్సులు చేస్తున్నా, ప్రైవేటు సంస్థలు అంతంతమాత్రంగానే అమలు చేస్తున్నాయి. కానీ సర్కారు ఆఫీసులకు సెలవును ప్రకటించినా, కొందరు ఓటర్లు హాలీ డేను ఎంజాయ్ చేయటం తప్పా, ఓటింగ్ లో పాల్గొనని సందర్భాలు సైతం లేకపోలేవు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న మంగళవారం ఎన్నికల సంఘం పోలింగ్ ను సాయంత్రం గంట సేపు పెంచుతూ జారీ చేసిన నిర్ణయంతో సాయంత్రం అయిదు నుంచి ఆరు గంటల్లోపు ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమున్నట్లు చెప్పవచ్చు.

సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకానున్న పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు నిరాటంకంగా కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. క్యూ లైన్ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తరలించనున్నారు.

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి

Just In

01

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!