Birth Of Castes In India
Editorial

Birth Of Castes: భారతదేశంలో వర్గాల పుట్టుక

Birth Of Castes In India: దేశంలోని శ్రామిక ప్రజల మధ్య వ్యవస్థాపరంగా అనైక్యతను కొనసాగిస్తూ పాలక వర్గాలు పెట్టుబడిదారి, దోపిడీ, అణిచివేతలను కొనసాగించడానికి కుల వ్యవస్థ ఉపయోగపడుతున్నది. మానవుల మధ్య కృత్రిమమైన అడ్డుగోడలను నిర్మించి ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేక భావాన్ని, దూర భావజాలాన్ని పెంపొందిస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ మీడియాను సైతం ఉపయోగించుకొని కుల భావ జాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చరిత్ర పరిణామ క్రమం గురించి తత్వవేత్తల్లో వెనుకటి కాలం నుంచి దైవం ఆశించే దాన్ని బట్టో, దైవాంశ సంభూతులైన రాజు, మత గురువుల ఇష్టా ఇష్టాన్ని బట్టి, మానవాతీత శక్తులను బట్టి సాగుతుందని భావవాద దృక్పథం ప్రబలంగా వుంది. దీంతో ప్రజలను తర తరాలుగా దోపిడీ చేస్తున్నారు. మానవ చరిత్ర పరిణామానికి ప్రధాన భౌతిక కారణంగా శ్రమ సంబంధాల నుంచి పుట్టుకొచ్చేదిగానే ఉంటుంది అని కారల్ మార్క్స్ అన్నారు.

చరిత్రలో చాలా దీర్ఘకాలం పాటు మానవులు సమాజ చరిత్ర గురించిన అవగాహనలో అనివార్యంగానే ఏకపక్ష అవగాహనకు పరిమితమైపోయారు. దీనికి కారణం దోపిడీ వర్గాల పక్షపాత బుద్ధి ఎల్లప్పుడూ చరిత్రను వక్రీకరించడం ఒకటైతే, చిన్న తరహా ఉత్పత్తి మానవుల దృక్పథాన్ని పరిమితం చేయడం రెండవ కారణం. బ్రహ్మాండమైన ఉత్పత్తి శక్తుల(భారీ పరిశ్రమల)తో పాటు ఆధునికమైన కార్మిక వర్గం ఆవిర్భవించిన తర్వాతనే మానవుడు సమాజ అభివృద్ధిని గురించి సమగ్రమైన చారిత్రక అవగాహనను సంపాదించుకోగలిగాడు. 1922లో హరప్పా, మొహంజోదారోలలో సింధూ నాగరికతకు చెందిన పురావస్తు అవశేషాలు లభ్యమయ్యే వరకు భారతదేశంలో నాగరికత ఆర్యులతోనే ఆరంభమైందని భావించేవారు. అనేక ప్రాంతాలలో తవ్వకాలలో వెల్లడైన పురావస్తు అవశేశాల ద్వారా సింధు నాగరికత అనేది కేవలం పంజాబ్, సింధు ప్రాంతాలకే పరిమితమై లేదని గుజరాత్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్‌లలోని ప్రాంతాలలో కూడా వ్యాపించి ఉన్నదని రుజువైంది. ఈ ప్రాంతాలలోని లోధాల్, సుర్కోతాండా, అల్లాదీన్, చన్హు దారో, ఆలంగిర్ పూర్, బాలకోట తదితర 260 చోట్ల రాగి- కంచు యుగపు నాగరికతకు సంబంధించిన అవశేషాలు కనుగొనబడ్డాయి. సింధు నది నుండి దక్షిణాన తపతి- నర్మద నదీ లోయల వరకు వేయి మైళ్ళకు పైగా వ్యాపించి ఉన్న ఈ నాగరికత తేలిక వ్యవసాయం పునాదిపై పట్టణాలను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చెందాయి.

ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి కంచు యుగపు నాగరికతలు ఎడారి గుండా ప్రవహించే నది లోయల్లోనే ఆరంభమయ్యాయి. సింధు, నైల్, యుప్రటిస్, టైగ్రీన్ వంటి నది లోయల్లో తేలిక వ్యవసాయంపై ఆధారపడిన (కర్ర నాగలి లేదా ముళ్ళ కర్రతో), వ్యవసాయ నాగరికతలు ఆవిర్భవించాయి. ఎందుకంటే ఈ నదులకు వరదలు వచ్చినప్పుడు వాటి పరివాహక ప్రాంతాలు సారవంతమై తేలిక వ్యవసాయం చేయడానికి అణువుగా ఉండేవి. అత్యంత సారవంతమైన భూమి కలిగిన నది లోయలు(గంగా, గోదావరి, అమెజాన్, మిసిసిపి మొదలైనవి) దట్టమైన అడవులతో నిండి ఉండడం వలన, ఇనుము కనుగొనబడే వరకు వ్యవసాయ యోగ్యమైనవిగా లేవు. అందువల్ల ఆ ప్రాంతాలలో ఇనుప యుగం ఆరంభమయ్యే వరకు నాగరికతలు తలెత్తలేదు. సింధు నాగరికతకు చెందిన లిపిని ఈనాటికి చదవలేకపోవడంతో చాలా విషయాలు ఇంకా మనకు అర్థం కానివిగానే ఉన్నాయి. అయితే, అక్కడి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి గురించి పురావస్తు తవ్వకాల నుండి కొంతమేరకు తెలుసుకోవచ్చు.

Also Read:  ప్రైవేట్ స్కూళ్ల వసూళ్లపై నియంత్రణ ఏది?

క్రీస్తు పూర్వం 2000 నాటికే తేలికపాటి వ్యవసాయం చేసే కంచు యుగపు నాగరికత సమాజాలు భారతదేశంలో ఉన్నాయి. సింధు లోయ ప్రాంతంలోని ద్రావిడులు ఇనుము, నాగలి తెలియని కాలంలోనే నదులకు ఆనకట్టలు కట్టి నీటిని మళ్లించి పంటలు పండించారు. మొహంజదారో, హరప్ప వంటి పట్టణాలను ప్రపంచంలో నాగరికత తెలిసిన మొదటి కాలంలోనే నిర్మించారు. సింధు వ్యాపారులు నైలు, మెసెపటోమియా వంటి పురాతన నాగరిక సమాజాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. మొదటగా వరద ముంపు భూములలో తేలికపాటి వ్యవసాయాన్ని చేసేవారు. సింధు నదికి, దాని ఏడు(నేడు ఐదే ఉన్నాయి) ఉప నదులకు అక్కడక్కడ అడ్డుకట్టలు నిర్మించి వరద ముంపునకు గురయ్యే భూమి విస్తీర్ణాన్ని పెంచుకున్నారు. మెసపోటోమియాలో లాగా కాలువలు తవ్విన దాఖలాలు లేవు. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు, పత్తి పండించారు. చేతి వృత్తులు, నగర నిర్మాణం, వర్తకం బాగా అభివృద్ధి చెందిన దశలో ఉండేవి. మెసపోటోమియాతో ఇతర పశ్చిమ ఆసియా కంచు యుగపు నాగరికతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేదని ఇరాక్, సిరియా తదితర స్థలాల్లో దొరికిన హరప్పా, మొహంజదారోకు సంబంధించిన ‘వ్యాపార ముద్రల’ ద్వారాను, మట్టి ఫలకాల ద్వారాను రుజువైంది. దంతం, రాగి, నెమళ్లు, కోతులు, సముద్రపు ముత్యాలు, వస్త్రాలు తదితర సరుకులు సింధు మైదాన ప్రాంతం నుండి మెసపటోమియాకు ఎగుమతి అయ్యేవి. రాగి తగర కంచు లోహ పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది ఉండి వాటిని కరిగించి పనిముట్లను ఆయుధాలను తయారు చేసేవారు. కాల్చిన ఇటుకలతో పటిష్టమైన భవంతులను నిర్మించారు. ఆ కాలంలో భారత ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో కంచు యుగపు వ్యవసాయ సమాజాలు చిన్న చిన్న అటటిక సమాజాలు ఉన్నాయి. కొన్ని తెగలు వ్యవసాయం, ఆహార సేకరణ, పశువుల పెంపకం చేసేవి. దక్షిణ ప్రాంతంలో నావికా వ్యాపారం కూడా ఉంది. అయితే కంచు యుగంలో ఇనుప యుగం కంటే ఉత్పత్తి తక్కువ. ఆ ఉత్పత్తి అంతా రాజన్య, పురోహిత, వర్తక వర్గం చేతుల్లో కేంద్రీకృతమైనది. సింధు నది నాగరికతలో బల ప్రయోగం లేకుండానే మత మౌడ్యం ద్వారా పాలక వర్గాలు ప్రజలను అదుపు చేసి ఉంటారని కోశాంబితో సహా అనేకమంది చరిత్రకారులు చెప్తారు. బల ప్రయోగం లేకుండా బానిస వ్యవస్థను ఊహించడం దుస్సాధ్యం కాబట్టి బానిస వ్యవస్థ కూడా ఉండకపోవచ్చునని వాదిస్తారు. పురావస్తు అవశేషాలలో సింధు నాగరికతకు సంబంధించిన ఆయుధాలు విరివిగా లభ్యం కాకపోవడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తారు.

బానిస వ్యవస్థ లేదని కానీ, బల ప్రయోగం అసలే ఉపయోగించలేదని లేదా అది తక్కువగా ఉపయోగించే వారని చెప్పడం వాస్తవం అనిపించదు. ఆర్యులు సింధు మైదానం వాసులతో తలపడి వారిని జయించిన పిమ్మట ఆ ఆయుధాలను తీసుకుపోయి ఉండడం కూడా సహజమే. పురావస్తు తవ్వకాలలో ఆయుధ నిక్షేపాలు ఎక్కువగా దొరకకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. పైగా బానిసలను గనులలోను, పరిశ్రమలలో వినియోగించకుండా అధిక మొత్తంలో అదనపు ఉత్పత్తిని సేకరించడం, పట్టణాలను పోషించడం అంతా సులభమైన విషయం కాదు. ఈ క్రూరమైన దోపిడీకి వ్యతిరేకంగా బానిసలు, ఇతర అణచబడ్డ తెగలు తిరగబడడం సహజం. దొంగతనాలు జరగకుండా పటిష్టమైన భవంతులను నిర్మించారంటేనే అశాంతి, అలజడి ప్రబలి ఉండి ఉంటుందని, బల ప్రయోగం లేకుండా దాన్ని అణిచి ఉంచడం సాధ్యం కాదని స్పష్టమవుతుంది. కోశాంబి వంటి చరిత్రకారులు తమ విశ్లేషణలను చేసే నాటికి హరప్పా, మొహంజదారో అనే రెండు పట్టణాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఇటీవలి కాలంలో ఇంకా అనేక పట్టణాలు కనుగొనబడ్డాయి. సమకాలీన మెసపటోమియాతో పోల్చి చూస్తే సింధు నాగరికత చాలా సామీప్యత ఉన్నట్లు కూడా కనబడుతుంది. మెసపటోమియాలో అనేక పట్టణాలు ఉన్నట్లు, ఒక్కొక్క పట్టణం తన పరిసర గ్రామాలతో కలిసి ఒక నగర రాజ్యంగా ఏర్పడి నిరంతరం పరస్పర సంఘర్షణలలో ఉన్నట్లు కనబడుతుంది. రాజులు, రాజవంశాలకు చెందిన చిహ్నాలు సింధు నాగరికతలో మనకు కనబడకపోయినా రాజన్య, పురోహిత, వర్తక పాలన పాలక వర్గాలు ప్రజల తిరుగుబాటులను అణిచి ఉంచడానికి, బల ప్రయోగానికి పాల్పడి ఉంటారని చెప్పవలసి వస్తుంది. శ్రామికుల శ్రమ దోపిడీపై ఆధారపడిన రాజన్య పురోహిత వర్గం పాలకవర్గంగా రూపుదిద్దుకున్నది. సింధు నాగరికత బానిస వ్యవస్థపై ఆధారపడి ఉందనేది మనం కచ్చితంగా చెప్పలేకపోయినా బల ప్రయోగం మాత్రం విస్తృతంగా ఉండేదని చెప్పవచ్చు. హరప్పా- మొహంజదారోలను ధ్వంసం చేయడంలో ఆర్యులకు అక్కడి ప్రజల తిరుగుబాట్లు కూడా సహాయకారిగా ఉండి ఉండవచ్చు.

-జంపన్న (మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు)

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?