What Is The Control Over Private School Fees: విద్యాదానం మహాదానం. ఇది ఒకప్పటి నానుడి. విద్య.. వ్యాపారం, మహా వ్యాపారం. ఇది ప్రస్తుత నానుడిలా వినిపిస్తోంది. చిన్న పిల్లల కోసం ప్లే స్కూల్ అని పెట్టేసి వేలకు వేలు ఫీజుల రూపంలో దోచేస్తున్నారు. పిల్లలు కొంచెం పెరగగానే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అని చిన్న పిల్లల జ్ఞానంతో సంబంధం లేకుండా బస్తాలకు బస్తాల పుస్తకాలు కొనుగోలు చేయించి, ఫీజులు దండుకుంటున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు. ఇది విద్య పేరుతో చేస్తున్న దోపిడీ కాక మరేంటి? ఎల్‌కేజీ పిల్లవాడి పుస్తకాల ఖరీదు దాదాపు 5 వేల పైమాటే. ఈ ధర చిన్న స్కూల్‌లో మాత్రమే. అదే పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో అయితే ఆ ఖరీదుతో ఓ కుటుంబం నెల రోజులు బతికేస్తుందంటే అతిశయోక్తి కాదు.
పిల్లలకు ఏ క్లాసుకు ఎన్ని పుస్తకాలు అవసరం అవుతాయి? ఎన్ని నోట్ బుక్స్ అవసరమౌతాయి అనేది ప్రభుత్వం నిర్దేశించదా? ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టమొచ్చినట్టు ఎవరి స్కూల్లో వారు ప్రత్యేక పుస్తకాలను ప్రవేశపెట్టొచ్చా? ఆ బుక్స్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండదా? ఒక విద్యా సంస్థలోని పుస్తకాలు ఎంపిక చేసిన ప్రత్యేక బుక్ స్టాల్‌లో మాత్రమే ఎందుకు లభిస్తున్నాయి? అన్ని బుక్ స్టాళ్లలో ఎందుకు లభించడం లేదు? పుస్తకాల విక్రయంపై బుక్ స్టాల్ వారి నుండి సంబంధిత విద్యా సంస్థకు అందే కమిషన్ శాతం ఎంత? అసలు స్కూల్లోనే అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న పాఠశాలలెన్ని? ఇలా శోధించుకుంటూ పోతే తొవ్వే కొద్దీ నిజాలు బయటపడుతూనే ఉంటాయి. ఇవన్నీ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ స్కూల్‌లో పిల్లలను చదివించే ప్రతీ సగటు మధ్యతరగతి మనిషికి తారసపడుతున్న ప్రశ్నలు. కానీ, ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు పాలించిన పాలకుల నుంచి ఎలాంటి సమాధానాలు లేవు. చర్యలు అంతకాన్నా లేవు.
ఏప్రిల్ నెల వస్తోందంటే చదువుకునే పిల్లలకు ఎక్కడలేని ఆనందం, సంవత్సరమంతా చదువు పేరుతో వారి బాల్యం హరించుకుపోతే కనీసం ఒక నెలా 15 రోజులైనా ఆనందంగా తమ బాల్యాన్ని ఆస్వాదించొచ్చునని అనుకుంటారు. అలాగే, వేసవి సెలవులు ముగుస్తున్నాయంటే మళ్ళీ బడికి వెళ్లాలని పిల్లలు ఆందోళన చెందుతుంటారు. అయితే, విద్యాసంవత్సరం ప్రారంభమవుతోందంటే, పిల్లల కంటే వారి తల్లిదండ్రులే భయపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫాం, షూస్, టై, బెల్టు, అన్నిటికీ మించి స్కూల్ ఫీజు కట్టాలని పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఎక్కడ అప్పు తీసుకురావాలో పిల్లల ముఖాల్లో ఆనందం చూడగలమో లేదో అనే మీమాంస వారిలో నెలకొని ఉంటుంది.
Also Read: నైపుణ్యాభివృద్ధితోనే నిరుద్యోగ సమస్యకు చెక్..
2004లో వచ్చిన జివో నెంబర్ 91 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో యునిఫాం, బుక్స్ అమ్మొద్దని, ఒకవేళ అమ్మితే తప్పనిసరిగా డిస్కౌంట్ ఇవ్వాలని ఉంది. కానీ, స్కూళ్ల యాజమాన్యాలు చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వారి బినామీలతో బుక్ షాప్ పెట్టించడం, లేదా ఏదైనా బుక్ షాప్ వాళ్లతో అధిక కమిషన్‌కు ఒప్పందం కుదుర్చుకొని విక్రయంలో లాభాలను గడించడం జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వినియోగించాలని, అట్టి పుస్తకాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలు ఉన్నాయి. కానీ, ఆ ఆదేశాలు అమలు అవుతున్నాయా? ఒక్కో స్కూల్‌కు ఒక్కో ప్రత్యేక పుస్తకాలు, ఒక స్కూల్ పుస్తకాలు మరో స్కూల్ పుస్తకాలతో సంబంధం ఉండదు. ధరలు అయితే వారికి ఇష్టమొచ్చినంత నిర్ణయిస్తారు. విద్యా హక్కు చట్టం 12(1) ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలో పొందు పరచబడి ఉంది. కానీ, గత ప్రభుత్వాలు ఈ మేరకు ప్రైవేట్ విద్యా సంస్థలలో అమలు చేసే విధంగా ముందుకు నడిచాయా? అంటే లేదనే చెప్పాలి. స్కూల్ పుస్తకాల నుంచి మొదలుకుంటే, ఫీజుల మోతతో సామాన్యులు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటానికే బతకాల్సి వస్తోంది. ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని ఏ ఒక్క అధికారి, పాలకులైనా తమ గుండెపై చేయి వేసుకొని చెప్పగలరా? వారి పిల్లలను ప్రభుత్వ బడులకు విద్యాభ్యాసానికి పంపగలరా? అంటే లేదనే చెప్పొచ్చు. నాణ్యమైన విద్యను తమ పిల్లలకు అందించాలనే తపనతో ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపలేక, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, పుస్తకాలు, షూ, టై ధరలంటూ దోపిడీకి గురికాలేక సతమతమవుతున్నారు మధ్యతరగతి జనాలు.
పిల్లల చేత వయస్సుకు మించి బరువులు మొయిస్తే బాల కార్మిక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం విద్య పేరుతో 15 కిలోల పైనే బరువుగల పుస్తకాలను పిల్లల చేత మోయిస్తూ అదే పని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చేయిస్తున్నాయి అనడంలో అభ్యంతరమేమీ లేదు. కాకపోతే, ఇది బాలకార్మిక చట్టం కిందకి రాదు. అంతే తేడా. ప్రైవేట్ విద్యాసంస్థల వసూళ్లు నియంత్రించడానికి ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయగలుగుతున్నాయి తప్ప, వాటిని సక్రమంగా అమలు చేసే స్థితిలో లేవు. ప్రైవేట్ స్కూళ్లపై గత ప్రభుత్వ నిబంధనలు, జీవోలు అమలుకాని స్థితిని చూస్తుంటే ఇది నిరూపితం అవుతోంది. ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థల పాఠ్యపుస్తకాలపై కఠిన నిబంధనలను అమలు చేయకపోతే సామాన్య తల్లిదండ్రుల జేబులకు మరోసారి చిల్లు పడటం ఖాయం. అంతే కాకుండా అధిక పుస్తకాల మోతతో పిల్లల మానసిక స్థితిపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడి పిల్లలను మానసికంగా శారీరకంగా హింసించినట్టే అవుతుంది. వారి ఎదుగుదల సైతం సరైన రీతిలో ఉండకపోవచ్చునని తెలుపుతున్నారు మానసిక నిపుణులు.
ప్రైవేట్ విద్యాసంస్థల వసూళ్లపై ఉక్కుపాదం మోపుతామని ఈమధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణ నిమిత్తం మంత్రుల ఉపసంఘం కమిటీని నియమించి తగు చర్యలకు పూనుకుంటుందని తెలిపారు పొన్నం. సామాన్య పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం ప్రకటించినట్టు తెలిపారు. మరి, ప్రైవేట్ స్కూళ్ల వసూళ్లపై నియంత్రణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమేర ముందుకు సాగుతుందో చూడాలి.
-శ్రీనివాస్ గుండోజు (జర్నలిస్ట్)