Teacher Misuse: హుజూరాబాద్ మండల విద్యా వనరుల కేంద్రం (MEO కార్యాలయం)లో జరుగుతున్న అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నాయి. కీలకమైన గణితం బోధించాల్సిన సబ్జెక్టు టీచర్‌ను, మండల విద్యాధికారి (MEO) శ్రీనివాస్ తన వ్యక్తిగత అవసరాలకు గత రెండేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, మండలంలోని కాట్రపల్లి పాఠశాల విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడు లేక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు.
కాట్రపల్లిలో మ్యాథ్స్ పోస్టు దగా..
కాట్రపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రసూతి సెలవులో ఉండటంతో, గత నెల రోజులుగా గణిత బోధన పూర్తిగా నిలిచిపోయింది. ప్రాథమిక స్థాయిలో పునాది పడాల్సిన గణితం సబ్జెక్టుకు గురువు లేకపోవడంతో ఆ పాఠశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీచర్‌ను తాత్కాలికంగానైనా ఏర్పాటు చేయాలని స్కూల్ హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నా.. MEO శ్రీనివాస్ పట్టించుకోకపోవడం దారుణం.
బోధన గాలికి: ప్రభుత్వ టీచర్ ఆఫీస్ ఆపరేటర్
ప్రభుత్వం గణిత బోధన కోసం జీతం ఇస్తుంటే, ఆ ఉపాధ్యాయుడు తరగతి గదికి శాశ్వతంగా దూరమై ఆఫీస్ పనికి అంకితమయ్యాడు. రంగపూర్ యూపీఎస్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా హుజూరాబాద్ ఎమ్మార్సీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగాపూర్ యూపీఎస్‌లో విద్యార్థులు తక్కువగా ఉన్న కారణంగా మాథ్స్ టీచర్ గోపాల్ రెడ్డిని డిప్యుటేషన్ పై MEO తన కార్యాలయంలో ఆపరేటర్ గా నియమించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన హాజరు కూడా ‘ఓడీ’ (On Duty) గా నమోదు కావడం లేదా జీతాల కోసం మాత్రమే స్కూల్‌కు వెళ్లి సంతకాలు పెట్టడం ద్వారా హాజరు పట్టికలో మోసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!
MEO పై సామాజిక వర్గం దాడి ఆరోపణలు
MEO శ్రీనివాస్ కావాలనే ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నప్పటికీ, గోపాల్ రెడ్డిని తన వ్యక్తిగత సహాయకుడిలా మానిటరింగ్ విజిట్‌లు, ఇతర కార్యక్రమాలకు తిప్పుకుంటున్నారని, ఇది ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. గతంలో డిప్యుటేషన్‌పై ఖాళీగా ఉన్న స్కూలుకు పంపాలని ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించగా.. MEO ఓ జీవోను చూపిస్తూ సమర్థించుకోవడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. బోధన అత్యవసరమైన సబ్జెక్టు టీచర్‌ను ఆపరేటర్‌గా నియమించడం విద్యార్థులపై వివక్ష చూపడమేనని సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనల ఉల్లంఘనే: జిల్లా విద్యాధికారి స్పష్టీకరణ
ఈ విషయంపై జిల్లా విద్యాధికారి (DEO) శ్రీరామ్ మొండయ్యను వివరణ కోరగా, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల సేవలు కార్యాలయ అవసరాల కోసం వాడుకోవడానికి వీల్లేదని, యథావిధిగా పాఠశాల విధులను నిర్వహించవలసిందేనని స్పష్టం చేశారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాట్రపల్లి విద్యార్థులకు న్యాయం జరగాలంటే, ఆఫీస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డిని తక్షణమే ఖాళీగా ఉన్న కాట్రపల్లి యూపీఎస్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులను, మానవ వనరులను దుర్వినియోగం చేసిన MEO శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: TET Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారంలో టెట్ నోటిఫికేషన్.!
